వచ్చే ఎన్నికల్లో అది పునరావృతం : చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో అది పునరావృతం : చంద్రబాబు

చంద్రబాబు రాష్ట్రంలో బీసీలకు ఇదేం ఖర్మ అని బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బీసీల పొట్టగొట్టి, జగన్‌ రెడ్డి తన పొట్ట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీలో బీసీకు కొన్ని పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని విమర్శించారు. మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. అమ్మబడి, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్టే ఇస్తున్నారు తప్ప బీసీలకు అదనంగా ఏం చేశారని ప్రశ్నించారు. 140 బీసీ కులాలకు జగన్‌ ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా, 3 మాత్రమే బీసీలకు ఇచ్చారని విమర్శించారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీకు వివిధ నామినేటెడ్‌ పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువని తెలిపారు. వీసీలు, సలహాదారుల్లో ఏ కులం వారు ఎక్కుగా ఉన్నారో చర్చించేందుకు జగన్‌ సిద్ధమా? అని సవాల్‌, చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం 2014 ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిందని, వచ్చే ఎన్నికల్లో అది పునరావృతం కానుందని అన్నారు.

 

 

 

Tags :