తప్పు చేసిన అధికారులకు తగిన మూల్యం : చంద్రబాబు

తప్పుచేసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాత్రిపూట కూల్చివేతల అంశంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అయ్యన్నది కబ్జా కాదని, ఇడుపులపాయలో వైఎస్ జగన్ 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడం కబ్జా చేశారని పేర్కొన్నారు. చలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. నిత్యం టీడీపీ నేతల హౌస్ అరెస్ట్లు జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయని అన్నారు. ప్రజల తరపున గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు, అరెస్ట్లు, ఇళ్లపై దాడులతో వారిని జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కక్ష సాధింపుకోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్న ఇంటిపై దాడి పతనమైన జగన్ ప్రభుత్వ ఆలోచనలకు పరాకాష్ట అని మండిపడ్డారు.