వారిపై కక్ష సాధింపులేంటి ? : చంద్రబాబు

వారిపై కక్ష సాధింపులేంటి ? : చంద్రబాబు

గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై కక్ష సాధింపులేంటని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందన్నారు. కోర్టులు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏలూరులో రంజిత్‌ అనే కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రంజిత్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు  ప్రభుత్వం ప్రయత్నించడం హేయనీయమని విమర్శించారు.

జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదని అన్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని అన్నారు. గుత్తేదారులెవరూ ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారికి  ప్రతిపైసా అందే వరకు బాధితుల తరపున టీడీపీ పోరాటం చేస్తుందని అన్నారు.  

 

Tags :