తమ పోరాటం పోలీసులపై కాదు.. చంద్రబాబు

తమ పోరాటం పోలీసులపై కాదు.. చంద్రబాబు

తమ పోరాటం పోలీసులపై కాదని, వైసీపీ పైనే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతూ టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది సైకో ప్రవర్తన ఉన్న పోలీసు అధికారులతో నిబంధనలకు వ్యతిరేకంగా టార్చర్‌ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు వెంకటేశ్‌, సాంబశివరావు విషయంలో వ్యవరించిన తీరు అమానుషమని ధ్వజమెత్తారు. తప్పుడు అధికారులను వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ తెలుగుదేశమే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో 600 మందిపై కేసులు పెట్టారు. 41ఏ నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తున్నారు. కొందరు అధికారుల ద్వారా తప్పుడు కేసులు పెడుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే పోలీస్‌ స్టేషన్‌కు నేను వెళ్తా. నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదన్నారు. పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? సాంబశివరావు, వెంకటేశ్‌ ఇళ్లకు వెళ్లి బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. 41ఏ నోటీసు ఇవ్వాలంటే అర్థరాత్రి ఇళ్లకు వెళ్లాలా?  ఇంటి గోడలు దూకి వెళ్లాలా, లైట్లు పగలగొడతరా? ఇలాంటి కేసులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. సుప్రీంకోర్టును సైతం లెక్క చేయని విధంగా ప్రవర్తిస్తున్నారు.  ఆయా అధికారులను చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. ఇలాంటి పాలనలో బలిపశువులు కావొద్దని పోలీసులను కోరుతున్నా అని హెచ్చరించారు.

 

Tags :