చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. పోలవరం వద్ద హైటెన్షన్

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. పోలవరం వద్ద హైటెన్షన్

పోలవరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు ఎవరికీ అనుమతి లేదని వారు పేర్కొన్నారు. అందుకు ఆగ్రహించిన చంద్రబాబు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చంద్రబాబు వెళ్లారు. కానీ ప్రాజెక్ట్ సందర్శనకు ఎవరికీ అనుమతి లేదంటూ ప్రాజెక్ట్ ముఖద్వారం వద్ద పోలీసులు బారీకేడ్లు పెట్టారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న చంద్రబాబును కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల ప్రవర్తనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేపట్టిన ప్రాజెక్ట్ సందర్శనకు తనకే అనుమతి లేదంటారా? అని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం నక్సలైట్లకు చెందిన వారోత్సవాల సందర్భంగా చంద్రబాబుకు నక్సల్స్‌ నుంచి ప్రమాదం ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ కారణంగానే చంద్రబాబుకు ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా మరో ఐదుగురు నేతలకు అనుమతులు ఇవ్వాలని పార్టీ నేతలు కోరారు. అందుకు కూడా పోలీసులు నిరాకరించారు. అయితే తనకు గురువారం కాకుంటే శుక్రవారం లేదా శనివారమైనా ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అందుకు పోలీసులు మౌనం పాటించారు. పోలీసుల చర్యలతో తీవ్రంగా ఆగ్రహించిన చంద్రబాబు అక్కడే ప్రాజెక్ట్ ముఖద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్ట్ సందర్శనకు తనకు అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, తనకు ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు.

 

 

Tags :