సైకిల్ దూకుడు..

వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. జగన్ అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్నారు. అందుకు.. తన సభలకు వస్తున్న ఆదరణే నిదర్శనమని చెబుతున్నారు. మొన్నటి వరకూ బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు.. ఇటీవలి కాలంలో ఇదేమీ ఖర్మ రాష్ట్రానికి అంటూ ఏపీని చుట్టేస్తున్నారు. స్థానిక వైసీపీ నేతల అవినీతిని ఎండగడుతూ... జగన్ సర్కార్ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో పరాభవం కారణాలు గుర్తించి అప్రమత్తమైన చంద్రబాబు.. ఈసారి ఏడాదిన్నర ముందుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ జగన్ సర్కార్ అవినీతిని ఎండగడుతూనే ప్రజలు టీడీపీవైపు మొగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు జగన్ సర్కార్ ఇటీవలి కాలంలో విద్యుత్ చార్జీలు, చెత్తపన్ను, ఇంటిపన్ను సహా చాలా పన్నులను పెంచేయడం టీడీపీకి కలిసొచ్చింది. వీటన్నింటినీ ప్రస్తావిస్తూ.. జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. ఇంక దీనికి తోడు లోకల్ మద్యం సంగతిని ప్రధానంగా ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఆడబ్బంతా జగన్ పాకెట్ లోకి పోతోందంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక ఎన్నికల్లో ఏపార్టీకైనా విజయాన్ని సాదించి పెట్టేవాటిలో ముఖ్యమైంది మ్యానిఫెస్టో.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ఆపార్టీ .. మ్యానిఫెస్టోలో స్పష్టం చేస్తుంది. దీంతో ఈసారి మ్యానిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలను గుర్తించి.. వాటిని ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు.. వీటిని రాజమండ్రిలో నిర్వహించే మహానాడులో ప్రస్తావించే అవకాశముంది. గత ఎన్నికల్లో ప్రస్తావించినట్లుగా జగన్ నవరత్నాలు, ఇతర అంశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు . ఈసారి టీడీపీ మ్యానిఫెస్టో.. వీటికి ధీటుగా , మరింత మెరుగ్గా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పార్డీ గెలుపులో కీలకభూమిక పోషించేది నాయకుల మధ్య సఖ్యత. అందుకే ఇటీవలి పర్యటనల్లో చంద్రబాబు ప్రధానంగా నేతల్ని పిలిపించి మరీ మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే టికెట్ ఇచ్చేది లేదని సంకేతాలు పంపుతున్నారు. దీంతో పార్టీ నేతల్లో కూడా కదలిక వచ్చినట్తు తెలుస్తోంది. ఫలితంగా అందరు నేతలు వేదికపై కనిపిస్తున్నారు. ఇది క్యాడర్ లో ఉల్లాసాన్నిస్తోంది. ఇదే స్ఫూర్తి ఎన్నికల వరకూ కొనసాగిస్తే గెలుపు ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్లు.