ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంత మంది : చంద్రబాబు

ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంత మంది : చంద్రబాబు

రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు రాష్ట్ర ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 34 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  ప్రభుత్వ అజాగ్రత్త, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోయని ఆరోపించారు. టీడీపీ  బాధితులకు అన్ని విధాల అండగా నిలవాలని పార్టీ వ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల  23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. జగన్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని అన్నారు. ఇళ్ల స్థలాలు, వాటిల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరణ పేరుతో ఒక్కో పేద కుటుంబం నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పేద కుటుంబాలు ఎవరూ ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెలరోజుల్లోగా ఉచితంగా పేదలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

 

Tags :