ముంబై పేలుళ్ల ఉగ్రవాదిని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న భారత్.. మళ్లీ అడ్డుపడిన చైనా

ఉగ్రవాదంపై చైనా మరోసారి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ముంబై పేలుళ్ల ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని భారత్ చేసిన ప్రతిపాదనను అడ్డుకుంది. ఐక్యరాజ్య సమిలో ఉగ్రవాద నిర్మూలనకు అమెరికా, భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుతగిలింది. 2008 ముంబై పేలుళ్ల ఉగ్రవాది, లష్కరే తోయిబా టెర్రరిస్టు నాయకుడు సాజిద్ మీర్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో చేర్చాలని, అతని ఆస్తులను స్తంభింపచేసి, ప్రయాణాలపై కూడా నిషేధం విధించాలని, వీటితోపాటు మరికొన్ని ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్ ప్రతిపాదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని మిగతా దేశాలు కూడా దీనికి అంగీకరించాయి. కానీ చైనా మాత్రం ఈ నిర్ణయాన్ని హోల్డ్‌లో ఉంచింది. దీంతో సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం మరింత ఆలస్యంకానుంది. ఇలా పాక్ ఉగ్రవాదులపై నిషేధాన్ని చైనా అడ్డుకోవడం ఇది వరుసగా మూడోసారి. ఈ ఏడాది జూన్ నెలలో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజహర్‌పై తీసుకొచ్చిన తీర్మానాలను కూడా చైనా హోల్డ్‌లోనే ఉంచింది.