చైనాకు భయపడి తైవాన్ ను వదిలేయలేం : పెలోసీ

అమెరికా కాంగ్రెస్ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన తైవాన్‌లో అగ్గి రాజేసింది. చైనా నుంచి 27 యుద్ధ విమానాలు తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయి. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు విధ్వంసకర సైనిక విన్యాసాలను చేపట్టనున్నట్టు చైనా ప్రకటించింది. దీంతో తమ నౌకాశ్రయాలు, పట్టణ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉన్నట్టు తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే 2.3 కోట్ల తైవాన్ ప్రజలు తల వంచే ప్రసక్తే లేదని ఆ దేశం ప్రకటించింది. మరోవైపు తైవాన్ నుంచి చేపలు, సిట్రస్ ఫలాలు, తేనే, తేయాకు తదితర కీలకమైన దిగుమతులను చైనా నిషేధించింది. తైవాన్‌కు ఇసుక ఎగుమతిని కూడా చైనా నిలిపివేసింది. ఇదిలా ఉండగా తైవాన్ అధ్యక్షురాలు ట్సాయ్ ఇంగ్`వెన్‌తో పెలోసీ సమావేశమయ్యారు. చైనా బెదిరింపులకు భయపడి, తైవాన్ విషయంలో తమ నిబద్ధతను వీడేది లేదని ఈ సందర్భంగా నాన్సీ స్పష్టం చేశారు. పెలోసీ బృందం తైవాన్ నుంచి దక్షిణ కొరియా పయనమైంది.