విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి

బివిఎం స్కూల్ లైబ్రరీకి పుస్తకాలు అందజేసిన తానా లైబ్రరీస్ కో ఆర్డినేటర్ చుండ్రు సతీష్
విద్యార్థులు చిన్నతనం నుండి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని,తద్వారా జ్ఞాన సముపార్జన సాధ్యమని తానా లైబ్రరీస్ కో ఆర్డినేటర్ చుండ్రు సతీష్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో బివిఎం స్కూల్ లైబ్రరీకి 234 పుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చుండ్రు సతీష్ మాట్లాడుతూ తానా ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన బివిఎం స్కూల్లోనే తన భార్య విద్యాభ్యాసం చేశారని, అటువంటి పాఠశాలకు తానా ద్వారా పుస్తకాలు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, స్పాన్సర్ రవి పొట్లూరి, రాజా కసుకుర్తి తదితరుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలను లైబ్రరీస్ కో ఆర్డినేటర్లుగా ఉన్న తాను, రమణ అన్నె కలిపి ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.
పాఠశాల సీనియర్ సభ్యులు ఎఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ బివిఎం పాఠశాలలో చదుకున్న ఎంతోమంది ప్రతిష్ఠాత్మకమైన తానాలో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా విద్యార్ధులకు చుండ్రు సతీష్ పుస్తకాలను అందజేసి పాఠశాలలో ఉన్న డిజిటల్ రూమ్, కంప్యూటర్ రూమ్, లైబ్రరీని సందర్శించారు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని సతీష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు లయన్ క్రొవ్వడి సాయికుమార్,సెక్రటరీ ఎమ్.ఎన్.వి.ఎస్. మురళీకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవోలు సుబ్బలక్ష్మి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
తానా ఫౌండేషన్ స్కూల్ లైబ్రరీల కో ఆర్డినేటర్‌గా సతీష్ చుండ్రు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల కోసం లైబ్రరీలను ఏర్పాటు చేసి వారికి చదువుతోపాటు ఇతర విషయాల్లో కూడా వారికి అవసరమైన విజ్ఞానాన్ని అందజేయనున్నది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, లైబ్రరీలకు పుస్తకాలను అందజేయడానికి వీలుగా తానా ఫౌండేషన్ స్కూల్ లైబ్రరీల కో ఆర్డినేటర్‌గా తానా మిడ్ అట్లాంటిక్ ఏరియాకు చెందిన సతీష్ చుండ్రును నియమించింది. గతంలో తానా మిడ్ అట్లాంటిక్ కో ఆర్డినేటర్‌గా అనేక సేవలందించిన సతీష్ చుండ్రు, కోవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలను కూడా అందించారు.