వాళ్లకు ముహూర్తం పెట్టిన జగన్, మాట వినకపోతే జోలపాట లేదు గురూ...?

వాళ్లకు ముహూర్తం పెట్టిన జగన్, మాట వినకపోతే జోలపాట లేదు గురూ...?

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కీలక మార్పులకు సమయం ఆసన్నమైందా...? ఇప్పటి వరకు చూసి చూడనట్టు వదిలేసిన సిఎం జగన్ కొందరి మీద చర్యలకు రంగం సిద్దం చేసారా...? కీలక నేతల నుంచి గల్లీ స్థాయి నాయకుల వరకూ అందరి పని తీరు మీద ఆయన ఫోకస్ చేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చూద్దాం.

పార్టీ పెట్టిన పదేళ్లకు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేస్తుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే సిఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలు ఆపడం లేదు. ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి విమర్శలు వచ్చినా, ముప్పేటా దాడి చేస్తున్నా తగ్గడం లేదు. కానీ ఇది అధికార పార్టీ నేతలకు ఎంత మాత్రం అర్ధం కావడం లేదనే ఆవేదన జగన్ లో ఉందనేది రాజకీయ విశ్లేషకుల్లో వినపడుతున్న మాట.

ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా వాటిని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలి. రాజకీయంగా వచ్చే విమర్శలకు క్షేత్ర స్థాయిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సోషల్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వరకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలి లేదంటే సృష్టించుకోవాలి. కాని అధికారం ఎంజాయ్ చేసే భావనలో ఉన్న చాలా మంది నేతలు జగన్ కు తలనొప్పిగా మారిపోయారు. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర వంటి కీలక సంక్షేమ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో వెళ్తున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా కులాలతో సంబంధం లేకుండా ఇవి దాదాపుగా అందరికి అందుతున్నాయనే భావన చాలా వరకు ఉంది. ఇదే సమయంలో విపక్షాలు వీటి నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాని ఇవేం పట్టనట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల కీలక నేతలు అనుసరిస్తున్న వైఖరి చికాకుగా మారింది. సోషల్ మీడియా మీద ఫోకస్ చేసి వీడియోలు, ఫోటోలతో ప్రూవ్ చేసుకునే అవకాశం చేతుల్లో ఉన్నా సరే వ్యాపారాల మీద ఫోకస్ చేస్తున్నారనే ఆగ్రహం జగన్ లో ఉంది.

అందుకనే పార్టీలో కీలక మార్పులకు జగన్ రంగం సిద్దం చేసారు. ఇప్పటికే కొందరు జిల్లాల అధ్యక్షులకు ఉద్వాసన పలికిన ఆయన త్వరలోనే ఎమ్మెల్యేలు ఉండగా... నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను నియమించనున్నారు. వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోని నాయకులను పూర్తిగా పక్కకు తప్పించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మండల అధ్యక్షులను కూడా పూర్తి స్థాయిలో మార్చేయనున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో సైతం ఇంచార్జ్ ల నియామకాలకు శ్రీకారం చుడుతున్నట్టుగా సంకేతాలు వెళ్తున్నాయి.

అంతే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. విపక్షాలకు సమాధానం ఇవ్వని నేతలను కొందరి గుర్తించారనే టాక్ వస్తుంది. అదే విధంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తూ సోషల్ మీడియా మీద ఫోకస్ చేయని నేతలకు ప్రత్యేక శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం. కీలక శాఖల మీద వచ్చే విమర్శలు, మూడు రాజధానుల మీద వస్తున్న అపోహలు, ఆరోపణలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఉన్న సందేహాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా పార్టీని సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎవరిని పక్కకు తప్పిస్తారు ఏంటీ అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.   

 

 

Tags :