మా స్నేహం గొప్పది...

మా స్నేహం గొప్పది...

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార పార్టీకి ఇబ్బందులు కలిగించేలా రాజకీయాలు సాగుతున్న వేళలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ పెళ్ళి వేడుకల్లో హాయిగా నవ్వుకుంటూ ముచ్చట్లు చేసుకుంటున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది.

తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.   కేసీఆర్‌, జగన్‌ పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు.  ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో ఉప్పు నిప్పులా పరిస్థితి ఉన్నా.. ఇద్దరు సీఎంలు మాత్రం ఆ గొడవలతో తమకేమీ సంబంధం లేనట్లుగా ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడం చూస్తుంటే వారి మధ్య ఉన్న స్నేహబంధం బాగానే ఉన్నట్లు కనిపించింది.

మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదాదల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మంత్రులు ఒకరిని ఒకరు టార్గెట్‌ చేసుకుంటునే ఉన్నారు. ఆ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది..

ఏపీ అసెంబ్లీలో  వైసీపీ మూకుమ్మడి మాటల దాడితో చంద్రబాబు.. మళ్లీ సీఎం అయ్యాకే సభలతో అడుగుపెడతా అంటూ శపథం చేశారు. ఆ వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన భార్యను వ్యక్తిగతంగా దూషించారు అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. దీనిపై చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తెలంగాణ నుంచి కూడా చాలామంది వైసీపీ తీరును తప్పు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు సీఎంలు వ్యక్తిగతంగా ముచ్చట్లు పెట్టడం వైరల్‌ గా మారింది.  దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్‌ చెవిలో కేసీఆర్‌ ఏదో చెబుతూ కనిపించారు. జగన్‌ కూడా కేసీఆర్‌ ఏదో వివరించారు. జగన్‌, కేసీఆర్‌ లు ఏం మాట్లాడుకున్నారన్నది ఇప్పుడు చర్చగా మారింది. జల వివాదంపై మాట్లాడుకున్నారా? కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారా అన్నది ఆసక్తిగా మారింది. లేక చంద్రబాబు కన్నీటి వ్యవహారంపై ఇద్దరూ మాట్లాడుకున్నారా అని కూడా చర్చ జరుగుతోంది.  ఏదీ ఏమైనా బయట ఉన్న వేడి పరిస్థితిని పట్టించుకోకుండా తమ మధ్య స్నేహం బలంగానే ఉందని చెప్పేలా వారు పక్కపక్కనే కలిసి కూర్చుని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Click here for Photogallery

 

Tags :