దేశంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయి.. జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో కేసీఆర్

దేశంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయి.. జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో కేసీఆర్

జాతీయ సమైక్యతా దినోత్సవాలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. 1947 సెప్టెంబర్ 17న భారత్‌లో హైదరాబాద్‌ విలీనమైందని గుర్తుచేశారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య తదితరుల సాహసాలు మరువలేనివన్నారు. అప్పట్లో ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించారన్నారు. ఆ రోజునే తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి.. ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు పయనించిందని కేసీఆర్ చెప్పారు.  ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. 1948 నుంచి 1956 వరకు తెలంగాణ రాష్ట్రంగా ఉందని.. అయితే ఆ తర్వాత రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పేరిట. .హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీలో కలిపారని వ్యాఖ్యానించారు. ‘ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది, ఎన్నోజీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. ఆ చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి’ అని కేసీఆర్ చెప్పారు.ఏపీలో విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలందర్నీ ఏకం చేసి 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఇప్పుడు తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయికంటే ముందుందని, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో దేశంలో మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయని, ఈ మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాయని చెప్పిన కేసీఆర్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర జరుగుతోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే.. సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు ఇలా చిచ్చులు పెడుతున్నాయని.. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదన్నారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నానని సీఎం స్ప‌ష్టం చేశారు.

 

Tags :