బృందా కారత్కు చేదు అనుభవం... మేడమ్ మీరు పైకి రావొద్దు

సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు ఆమె చేరుకున్నారు. అయితే వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పునియా ఈ నిరసనలకు నేతృతవ్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు కారత్ను ఉద్దేశిస్తూ భారత్ మాతా కీ జై నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్టు నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు.