ఎపి ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయశాఖ ఎన్నారై వింగ్‌ సలహాదారునిగా సి.వి సుబ్బారావు నియామకం

ఎపి ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయశాఖ ఎన్నారై వింగ్‌ సలహాదారునిగా సి.వి సుబ్బారావు నియామకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయశాఖ ఇ-హుండీ​/ ​ఇ-డొనేషన్స్‌, పరోక్ష సేవ మొదలైన కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. మరిన్ని సేవలను అందించే ప్రణాళికల్లో భాగంగా రాష్ట్ర ఎండోమెంట్స్‌ విభాగం సీనియర్‌ మీడియా ప్రొఫెషనల్‌ అయిన శ్రీ సి.వి. సుబ్బారావును అడ్వయిజర్‌ దేవాల​యాలు​ (ఎన్నారై​ ​వింగ్‌)గా నియమించింది. గౌరవ దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు సుబ్బారావును పరిచయం చేస్తూ, శ్రీ సుబ్బారావు ఈనాడు, ఉదయం, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికల్లో సీనియర్‌ హోదాల్లో పనిచేసి ఇప్పుడు అమెరికాలో గత 18 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న తెలుగుటైమ్స్‌ పత్రికకు ఎడిటర్‌, పబ్లిషర్‌, మేనెజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని, ఆయనలాంటి సీనియర్‌ మీడియా పర్సన్‌ రాష్ట్ర దేవాదాయశాఖకు ఉండటం వల్ల మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. శ్రీ సి.వి. సుబ్బారావు గతంలో యుఎస్‌ఎలోని దేవాలయాల కోసం టీటీడి ద్వారా ఆగమశాస్త్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన వర్క్‌షాపును సమన్వయం చేశారని, యుఎస్‌లో టీటీడి ద్వారా 5 సార్లు శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాలను చేశారని, అన్నవరం దేవస్థానం తరపున అమెరికాలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలను, భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారామకళ్యాణాలను, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం తరపున కనకదుర్గ కుంకుమపూజలను చేశారని ఇలా ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉందని చెప్పారు.

విదేశాల్లో దేవాలయం ఏర్పాటు విషయమై విదేశీ భక్తుల నుంచి ఆగమ, ఇతర విషయాలపై రాష్ట్ర దేవాదాయశాఖకు ఎన్నో అభ్యర్థనలు వస్తున్నాయని, అలాగే పలువురు ఎన్నారైలు తమ తమ ఊర్లలోని దేవాలయాల అభివృద్ధికి ముందుకు వస్తున్నారని ఇలాంటి విషయాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవడానికి శ్రీ సుబ్బారావుగారు ఎండోమెంట్స్‌ డిపార్ట్‌మెంట్స్‌కు సహకరిస్తారని ఆయన వివరించారు.

 

Tags :