అమెరికా టీ20 లీగ్.. సత్య నాదేళ్ల టీమ్ తో జట్టు కట్టిన ఢిల్లీ క్యాపిటల్స్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణ కోసం భారీ స్థాయిలో లీగ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, అబుదాబి టీ10 లీగ్, దక్షిణాఫ్రికా లీగ్ ఇలా సందడి నెలకొంది. తాజాగా అమెరికాలోనూ క్రికెట్ ఖ్యాతిని పెంచేందుకు కొత్తగా టీ20 ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ సిద్ధమవుతోంది. మేజర్ లీగ్ క్రికెట్ పేరిట ఈ ఏడాది జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో జట్టు కడుతున్నట్టు ప్రకటించింది. టెక్ దిగ్గజం సత్య నాదెళ్లకు భాగస్వామ్యం ఉన్న సియెటెల్ ఫ్రాంచైజీతో ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి పనిచేయనుంది. సీయాటెల్ ఆర్కాస్ పేరుతో ఎంఎల్‌సీలో ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహా యజమాని జీఎంఆర్ గ్రూప్ త్వరలోనే సీయాటెల్ ఆర్కాస్‌తో జట్టు కట్టనుంది. ప్రపంచ స్థాయి క్రికెట్ జట్టును తయారు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది అని ఎంఎల్‌సీ ఓ ప్రకటనలో పేర్కొంది. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీలకు కూడా భాగస్వామ్యాలు ఉన్నాయి.