ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. ఐదు ఛానెళ్లకు కోర్టు నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. ఐదు ఛానెళ్లకు కోర్టు నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. రోజురోజుకు ఇందులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈ స్కాం కేసు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. పలు పార్టీల నేతల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన సమాచారం మీడియా ఛానెళ్లకు లీక్ అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్ట్ దర్యాప్తు సంస్థల తీరుపై విచారణ చేపట్టింది. అయితే కేసు విషయంలో కోర్టులో వాదనల సందర్భంగా తాము ఇప్పటివరకు ఎటువంటి పత్రికా ప్రకటన చేయలేదని, సీబీఐ మాత్రం మూడు ప్రకటనలు చేసిందని ఈడీ వెల్లడించింది. సీబీఐ ఇచ్చిన ప్రకటనలకు, మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో మొత్తం ఐదు టీవీ ఛానెళ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాటిలో రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ, జీ న్యూస్, ఏఎన్ఐ మీడియా సంస్థలు ఉన్నాయి. కేసు విషయంలో సీబీఐ, ఈడీ అడగని విషయాలను కూడా అడిగినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది. అనంతరం ఈ ఐదు సంస్థల వార్తా నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (NBDSA)కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ ఛానెళ్ల ప్రసారాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా? అని తమకు నివేదిక సమర్పించాలని తెలిపింది. అనంతరం ఈ కేసులో దర్యాప్తు సంస్థల ప్రకటనల ఆధారంగా వార్తా కథనాలు ప్రసారం కావాలని, ప్రసార మార్గదర్శకాలను తూచా తప్పకుండా ప్రతి సంస్థ పాటించాలని ఛానెళ్లకు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.