రివ్యూ : రవితేజ డబల్ మాస్ 'ధమాకా'

రివ్యూ : రవితేజ డబల్ మాస్ 'ధమాకా'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5

నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
తారాగణం: రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల, రావు రమేష్,
హైపర్ ఆది, ప్రవీణ్, ఆలి, పవిత్ర లోకేష్, తులసి తదితరులు కెమెరా: కార్తిక్ ఘట్టమనేని
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి సంగీతం: భీంస్ సెసిరీలియో సహా నిర్మాత: వివేక్ కూచిబొట్ల
నిర్మాత: టి జి విశ్వప్రసాద్ దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
విడుదల తేదీ : 23.12.2022

రవితేజకి తనని అభిమానించే మాస్ ఆడియన్స్ కోసం తన సినిమాల్లో మాస్ కంటెంట్ ఉండేలా ఆయన చూసుకుంటారు. అలా మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుని ఈ సారి జాగ్రత్తగా ఆయన చేసిన సినిమానే 'ధమాకా'. ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ఇదేదో ఆడే సినిమానే అనే అభిప్రాయాలు వెలువడ్డాయి. టాలీవుడ్లో వరుసపెట్టి పెద్ద సినిమాలు తీస్తున్న పీపుల్స్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది.టాప్ డైరక్టర్ గా పేరు పొందకపోయినా మాస్ మూవీస్ తీసిన డైరెక్టర్ గా... కెరీర్లో బ్లాక్ బస్టర్లు లేకపోయినా పర్వాలేదనిపించే చిత్రాలు అందించిన నక్కిన త్రినాథరావు దీనికి దర్శకుడు. మాస్ హీరో .. మాస్ డైరెక్టర్ కలిసి చేసిన ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో సందడి చేసిందనేది సమీక్షలో చూద్దాం.

కథ:

రవి తేజ ను వెనక నుంచి తలమీద ఎవరో కొట్టడంతో ఆ పాత్ర చనిపోవడం, ఆ శవాన్ని మార్చురీలో పెట్టి లాక్ చేయడంతో సినిమా ఓపెనవుతుంది. అక్కడికి 18 రోజుల వెనక్కు వెళ్లి అసలు కథ షురూ అవుతుంది. అదే ఈ కథ నందగోపాల్ చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) పెద్ద బిజినెస్ మేన్. ఆయన తనయుడే ఆనంద్ చక్రవర్తి (రవితేజ). బిజినెస్ లో తండ్రికి సహాయంగా ఉంటూ ఉంటాడు. తాను ఎక్కువ కాలం బ్రతకనని తెలుసుకున్న నందగోపాల్, తన సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను తన బిజినెస్ లో భాగస్వాములుగా ప్రకటిస్తాడు. ఇక జేపీ (జయరామ్) దౌర్జన్యంతో ఒక్కో సంస్థను ఆక్రమించుకుంటూ ఎదుగుతూ ఉంటాడు. ఈ విషయంలో ఆయనకి తోడుగా ఆయన కొడుకు అథర్వ ఉంటాడు. అలాంటి జేపీ కన్ను నందగోపాల్ సంస్థలపై పడుతుంది. దాంతో ఆ సంస్థలను ఆక్రమించుకోవడానికి రంగంలోకి దిగుతాడు. అదలా ఉండగా వాసుదేవరావు (తనికెళ్ల భరణి) దంపతుల తనయుడు స్వామి (రవితేజ) తన ఆవేశం కారణంగా ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని, కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. తన చెల్లెలి స్నేహితురాలైన ప్రణవి (శ్రీలీల) ప్రేమలో స్వామి పడతాడు. కానీ ప్రణవి తండ్రి (రావు రమేశ్) ఆమెను ఆనంద్ కి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు.

ఆనంద్ - స్వామి ఇద్దరూ ఒకేలా ఉండటంతో, స్వామి అనుకుని ఆనంద్ తో పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తన కూతురు శ్రీమంతుల ఇంటికి కోడలిగా వెళుతుందని భావించిన ప్రణవి తండ్రి, ఆనంద్ మాదిరిగానే ఉన్న స్వామిని చూసి షాక్ అవుతాడు. తన దారికి అడ్డుగా ఉన్న ఆనంద్ ను హతమార్చాలని జేపీ ప్లాన్ చేస్తాడు. తన కూతురు ఆనంద్ ను వివాహం చేసుకోవాలంటే స్వామిని హతమార్చాలని ప్రణవి తండ్రి పథకం వేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేదే మిగతా కథ.

నటి నటుల హావభావాలు:

రవితేజ ఇటు మధ్య తరగతి ఇంట్లో .. అటు శ్రీమంతుల ఇంట్లో ఒకే ఊళ్లో పెరుగుతాడు. కానీ ఈ ఇద్దరూ ఒకేలా ఉన్నారని ఎవరూ అనుకోకపోవడం ఆశ్చర్యం. డబలాక్షన్ తన దైన శైలిలో చక్కగా చేసాడు. కథ, కథనం ఎలా ఉన్నా సినిమాని పూర్తిగా తన బుజాల పైన వేసుకుని సినిమా మొత్తం నడిపించాడు. హీరోయిన్ శ్రీలీల మాత్రం డ్యాన్సులు బాగా చేసింది. రావు రమేష్ ఇలాంటి పాత్రలు చాలానే చేసేసాడు. అయితే అతనిపై చిత్రీకరించిన ఇంద్ర స్పూఫ్, ఎం ధర్మరాజు ఎమ్మే తరహా డైలాగ్స్ నవ్విస్తాయి. రవితేజ-రావు రమేష్ మధ్యన పెట్టిన తిట్ల దండకం మాత్రం చిరాకు పెట్టిస్తుంది. అవసరం లేని నాన్ సింక్ సాగతీత అది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలచాలని నానా దినుసులు వేసేయడం వల్ల ఇలా అక్కర్లేని జంక్ సీన్స్ అక్కడక్కడ పడ్డాయి. ఆలి ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులా కనిపిస్తే హైపర్ ఆది మెయిన్ కమెడియన్ గా ఉన్నాడు. అయితే హైపర్ ఆది కామెడీ పంచులు జబర్దస్త్ స్కిట్స్ ని తలపిస్తూ ఆకట్టుకున్నాయి. అలాగే మరొక కమెడియన్ ప్రవీణ్ కూడా...మరీ చిన్న పాత్ర ఇచ్చి పక్కన పెట్టేసారు తనికెళ్ల, తులసి, సచిన్ ఖేదేకర్, పవిత్ర లోకేష్ తమ పాత్రల పరిధిలో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను ప్రసన్నకుమార్ బెజవాడ అందించాడు. పాత ఫార్మేట్ నే అని అనిపించకుండా ఆయన ఈ కథను రెడీ చేసిన తీరు బాగుంది. స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కథ మొదటి నుంచి చివరి వరకూ చాలా ఫాస్టుగా నడుస్తుంది. రవితేజను అటు క్లాస్ గాను .. ఇటు మాస్ గాను ఈ కథలో డిజైన్ చేశాడు. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఏ పాత్రకీ కూడా హెవీ లుక్ గానీ .. మేనరిజమ్స్ గాని పెట్టలేదు. అయినా రెండు పాత్రల మధ్య తేడా స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దర్శకుడు విషయానికొస్తే... అటు సన్నివేశాల పరంగా .. ఇటు డైలాగ్స్ పరంగా .. పాటల పరంగా ఎక్కడా కూడా మాస్ అంశాలు తగ్గకుండా చూసుకున్నాడు. తన కూతురు కోసం రవితేజ ఇంటికి రావు రమేశ్ వచ్చే సీన్, రావు రమేశ్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి రవితేజ వెళ్లే సీన్ లోను కామెడీ పండించడానికి దర్శకుడు ప్రయత్నించడం కాస్త అసహనాన్ని కలిగిస్తుంది.భీమ్స్ ట్యూన్ చేసిన పాటలు మాస్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టుమార్కు 'జింతాక్' సాంగ్ కి ఇవ్వొచ్చు. ఆ తరువాత స్థానంలో 'దండకడియాల్' .. 'వాట్స్ హ్యాపినింగ్' కనిపిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం భీమ్స్ తడబడ్డాడనే విషయం తెలిసిపోతూనే ఉంటుంది. కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను .. పాటలను .. ఫైట్స్ ను చిత్రీకరించిన తీరు నచ్చుతుంది. ముఖ్యంగా సాంగ్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా ఫరవాలేదు.

విశ్లేషణ:

ధమాకా చిత్రం చూస్తుంటే... ఎప్పుడో వచ్చిన చిరంజీవి రౌడీ అల్లుడు, ఎన్.టి.ఆర్ రాముడు భీముడు లాంటి సినిమాలు గుర్తురావడం సహజం. ఇద్దరు రవితేజలు తారుమారై విలన్ని ఆడుకుంటారని అనిపిస్తుంది. సాధారణంగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే యాడ్స్ వేసినప్పుడు "డబుల్ ధమాకా" అంటుంటారు. ఇక్కడ టైటిల్ లో "ధమాకా" మాత్రమే ఉంచి డబుల్ అనే పదాన్ని క్యాప్షన్లో పెట్టారు. ఈ చిత్ర కథకులు తమ మేధస్సుని ప్రయోగించి ఊహించని ట్విస్టులు ఇచ్చి ప్రేక్షకుల్ని అబ్బురపరిచే ప్రయత్నం చేసారు. అయితే ఆ రచనలో ఐక్యూ తక్కువ, అతి ఎక్కువ అనిపిస్తుంది. ఎంత మాస్ సినిమా అనుకున్నా ప్రేక్షకులు తెలివి మీరారు. లాజిక్కుని పక్కనపెట్టి మ్యాజిక్కుతో ట్రావెల్ కావాలన్నా కనీసమైన కామన్ సెన్స్ వాడాలంటున్నారు. ఈ సినిమాలో చాలా చోట్ల అది లోపిస్తుంది. రవితేజ మార్క్ మూవీ కనుక ఆయన అభిమానులకు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. లాజిక్కు లు కాంప్రమైజ్ అయితే తప్ప మనకు సినిమా రుచించదు.

 

 

Tags :