ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారు

రాష్ట్రపతి పీఠాన్ని తొలిసారి ఓ గిరిజన మహిళ అధిరోహించడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో అధికార ఎన్‌డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిసాకు చెందిన ఆదివాసీ గిరిజన మహిళా నాయకురాలు ద్రౌపది ముర్ము (64) ఎంపికయ్యారు.  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన భేటీలో 20 పేర్లపై విస్తృత చర్చ జరిగిందని, చివరకు ఆదివాసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిశ్చయించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు తెలిపారు. తూర్పు భారతం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రపతి కాలేదని, ఆదివాసీకి కూడా అవకాశం లభించలేదని, మహిళలకు అవకాశమివ్వాలని బోర్డు సభ్యులు పలువురు సూచించారని తెలిపారు. చివరకు జార్ఖండ్‌ తొలి మహిళ గవర్నర్‌గా, ఒడిసాలో నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ద్రౌపది ముర్మును నిలపాలని నిర్ణయించామన్నారు. మృదుస్వభావి అయిన ఆమెకు పరిపాలనా అనుభవం ఉందని తెలిపారు.

 

Tags :