మునుగోడు నుంచి అసెంబ్లీకి మరో ఆర్

మునుగోడు నుంచి అసెంబ్లీకి మరో ఆర్

ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ తరపున ట్రిపుల్‌ ఆర్‌ ఉందని, మునుగోడు ఎన్నికతో మరో ఆర్‌ అసెంబ్లీ అడుగు పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం అంశంపై కోర్టు తీర్పు వస్తుందని, త్వరలోనే ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుందని తెలిపారు. వేములవాడలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పేరు మార్చి, ఎంఐఎం అనుమతితో ప్రభుత్వం వేడుకలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సెక్యులరిజమా లేక మతతత్వమా? సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ఏటా రూ.100 కోట్లు ఇస్తామని మాట తప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని తెలిసి, ఆయనకు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే 8 ఏళ్లుగా చేసిన  అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేవలం రంగురంగుల బ్రోచర్లు తప్ప నయాపైసా పని చేయలేదన్నారు.

 

Tags :