సులభతర వాణిజ్యంలో మన ర్యాంక్ ఎంత?

సులభతర వాణిజ్యంలో మన ర్యాంక్ ఎంత?

కేంద్రం ప్రభుత్వం ప్రకటించే సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల కోసం వివిధ రాష్ట్రాలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుకు అద్దం పట్టే ఈ ర్యాంకులు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలోనూ కీలకమవుతున్నాయి. ఈఓడీబీ ర్యాంకుల్లో ఒక్కసారి మినహా ప్రతిసారి తొలి మూడు స్థానాల్లో నిలిచిన తెలంగాణ కూడా ఈ ర్యాంకులు ఎప్పుడు వస్తాయోనని ఇప్పుడు ఎదురు చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) 2015 నుంచి ఈఓడీబీ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పాలన సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ర్యాంకుల ప్రకటనలో కేంద్రం సూచించే బిజినెస్‌ రిఫారమ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (బీఆర్‌ఏపీ) పాయింట్లు కీలకంగా మారుతున్నాయి.

2015 ఈఓడీబీ ర్యాంకుల్లో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2016లో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి మొదటి స్థానంలో, 2018లో రెండు, 2019లో మూడో స్థానంలో నిలిచింది.  2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి డీపీఐఐటీ 301 బీఆర్‌ఏపీ సంస్కరణలను సూచించి గతేడాది సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించింది. డీపీఐఐటీ సూచించిన సంస్కరణలను అమలు చేసిన ప్రభుత్వం అందుకు అవసరమైన పత్రాలనూ డీపీఐఐటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. వివిధ రాష్ట్రాల సంస్కరణల వివరాలను పరిశీలించి, సంబంధిత వర్గాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వాటన్నింటినీ డీపీఐఐటీ మదింపు చేస్తుంది. 2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి వివరాలు సమర్పించి ఏడాదవుతున్నా ఈ మదింపు ప్రక్రియ కొలిక్కి రావట్లేదు. త్వరలోనే ఈ ర్యాంక్‌లు వెల్లడి కావచ్చునని భావిస్తున్నారు.

 

Tags :