పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ కీలక ప్రతిపాదన

పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ కీలక ప్రతిపాదన

ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదన చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తాము పనిచేస్తున్న కేంద్రంలోనే తమ పోస్టల్ బ్యాలెట్లను సమర్పించే అవకాశం కల్పించాలని భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం జరిగే అవకాశం ఉందనే కారణంతోనే ఈసీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇదే ప్రతిపాదనతో కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది.. తమ పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలలోపు సమర్పించే అవకాశం ఉంది. ఈ కారణంతో సిబ్బంది వాటిని చివరి వరకు తమ వెంటనే ఉంచుకుంటున్నట్లు ఈసీ గుర్తించింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో విధులు ముగిసిన తర్వాత సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్లను ఇంటికి తీసుకెళ్లడంపై కూడా ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 18 ప్రకారం.. కౌంటింగ్ తేదీ ఉదయం వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరిస్తారు. గడిచిన రెండేళ్లలో గోవా, కేరళ, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇలా కౌంటింగ్ రోజున 50శాతంపైగా పోస్టల బ్యాలెట్లు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది తాము పనిచేసే కేంద్రంలోనే ఓటును వినియోగించుకోవడంపై కొన్నిరోజుల క్రితం జరిగిన సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషన్ అనూప్ చంద్రపాండే నిర్ణయించారు. ఇదే విషయాన్ని వివరిస్తూ కేంద్ర న్యాయశాఖకు ఈసీ లేఖ రాసింది.

 

Tags :