ఎకో ఇండియాతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు వైసీపీ సర్కార్ కీలక ముందడుగు వేసింది. న్యూఢిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్‌కు ఓ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అవగాహనా పత్రంపై కూడా సంతకం చేసింది. ఈ రోజు(శుక్రవారం) మంగళగిరిలోని ఎపీఐఐసీ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతకంటే ముందు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబుతో ఎకో ఇండియా బృందం భేటీ కాగా.. రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల గురించి వారి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎకో ఇండియా బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని కృష్ణబాబు స్పష్టం చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఎన్ హెచ్ఎం మిషన్ డైరెక్టర్ జె. నివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎల్‌బీఎస్‌హెచ్ దేవి, ఎకో ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ భల్లా, డిప్యూటీ జనరల్ మేనేజర్ దీపా ఝాలు ఈ అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ భల్లా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్య ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులు తెస్తుందని, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు.