వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. మద్యం కేసులో అరుణ్ పిళ్లైని కోర్టులో హాజరు పరిచిన అధికారులు ఐదు రోజుల పాటు కస్టడీకి కోరారు. ఇతర నిందితులతో కలిసి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలపగా, 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కొందరు నిందితులు, సాక్షులను కలిపి ప్రశ్నిస్తున్నామని చెప్పిన ఈడీ అధికారులు, కొందరిని మళ్లీ విచారణకు పిలిచినట్టు కోర్టుకు తెలిపారు. ఈ రోజు విచారణకు ఎమ్మెల్సీ కవిత రాలేదని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. పిళ్లై కస్టడీ పొడిగిస్తే బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నిస్తామంది. ఈ కేసులోనే వైసీపీ ఎంపీ శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు న్యాయస్థానానికి ఈడీ తెలిపింది.