రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31వ తేదీగా నిర్ణయించింది జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో అత్యధికంగా 11 సీట్లలో ఎన్నికలు జరగనుండగా, ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులో ఆరేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరీ పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్ అవుతున్నారు.