కోశలనగరం పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు

కోశలనగరం పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు

చిత్తూరు జిల్లా కోశలనగరం వద్ద ఏపీఐఐసీ ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. చెన్నై, తిరుపతి, చిత్తూరు నగరాలకు దగ్గరగా ఉండే విధంగా సుమారు 2,300 ఎకరాల్లో ఏపీఐఐసీ ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనుంది. ఇందులో 1,371.52 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు, మిగిలిన స్థలాన్ని మౌలికవసతుల కల్పనకు వినియోగించనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ పారిశ్రామిక పార్కుకు కీలకమైన పర్యావరణ అనుమతులు రావడంతో మౌలికవసతుల అభివృద్ధి కోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో 26 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి

రాష్ట్రంలో లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లను బలోపేతం చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా 26 ఉత్పత్తులను గుర్తించి అన్ని సౌకర్యాలు ఒకేచోట లభించే విధంగా క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడిరచారు. జగయ్య పేటలో ఆభరణాల క్లస్టర్‌, కాకినాడలో ప్రింటింగ్‌, తూర్పుగోదావరి జిల్లా మాచవరంలో పప్పుదిను సులు, రాజమండ్రిలో ఫర్నిచర్‌, నెల్లూరులో రెడీ మేడ్‌ దుస్తుల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. 2023 నాటికి అన్ని అసెంబ్లీ నియోజ కవర్గాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

 

Tags :