అసలు రాష్ట్రంలో పాదయాత్రలు ఎందుకో? : ఎర్రబెల్లి

అసలు రాష్ట్రంలో పాదయాత్రలు ఎందుకో? : ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్‌ మోసం చేయగా, ఇప్పుడు బీజీపీ కూడా మోసం చేసిందని మండిపడ్డారు. కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు.  విభజన చట్టంలో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు హమీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. వరంగల్‌ వచ్చినప్పుడల్లా బండి సంజయ్‌ కోడ్‌ ఫ్యాక్టరీ తెస్తామని చెబుతున్నారని అన్నారు. హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విభజన హామీలు అమలు చేశాకే బీజేపీ నేతలు రాష్ట్రంలో తిరగాలని అన్నారు.

 

Tags :