ఇది కావాలని చేశారా? లేదా యాదృచ్ఛికంగా జరిగిందా?

తెలంగాణలో నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితనం ఏవిధంగా ఉందో అర్థమవుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ సందర్భగా ఈటల మీడియాతో మాట్లాడతూ ఇది కావాలని చేశారా? లేదా యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడం లేదన్న ఈటల దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. రద్దయిన పరీక్షలను వెంటనే నిర్వహించాలన్నారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు కష్టపడి అప్పులు చేసి చదువుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ వారు చదువుకోవడానికి ప్రభుత్వ ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. యువత తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు.