మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఈ నెల 29 నుంచి ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగే అంబీషన్‌ ఇండియా-2021 సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఫ్రెంచ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంబీషన్‌ ఇండియా 2021 సదస్సులో కీనోట్‌ స్పీకర్‌గా గ్రోత్‌ డ్రాఫ్టింగ్‌ ప్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కోవిడ్‌ ఎరా అనే అంశంపై తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ఫ్రెంచ్‌ ప్రభుత్వం కోరింది.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ఫ్రెంచ్‌ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్‌ కేర్‌, క్లైమేట్‌ చేంజ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ ఫర్మేషన్‌, ఆగ్రో బిజినెస్‌ వంటి ప్రధానమైన అంశాలపైన చర్చించనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఫ్రెంచ్‌, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని తెలిపింది.

ఫ్రెంచ్‌ దేశ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఫ్రెంచ్‌ దేశపు ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

 

Tags :