MKOne TeluguTimes-Youtube-Channel

రివ్యూ: సుడిగాలి సుధీర్ నటనే హైలెట్ గా 'గాలోడు'

రివ్యూ: సుడిగాలి సుధీర్ నటనే హైలెట్ గా 'గాలోడు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: సంసృతి ఫిలిమ్స్,
నటీనటులు: సుధీర్ ఆనంద్, గెహ్నా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ
ఎడిటర్: ఎం ఎస్ ఆర్, సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్,
నిర్మాత, కథ, స్క్రీన్ -ప్లే, మాటలు, దర్శకత్వం : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
విడుదల తేదీ : 18.11.2022

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ వంటి టి వి షోస్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ  త‌న‌కంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న న‌టుడు, మ్యూజిసియాన్ ' సుడిగాలి సుధీర్‌. ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై హీరోగా థర్డ్ మూవీ  గాలోడు సినిమాతో రెడీ అయ్యారు. ఇది వ‌ర‌కే సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సుధీర్‌. అయితే గాలోడు చిత్రంతో మాస్ హీరోగా సుధీర్ ప్ర‌య‌త్నం చేశారు. ఈ చిత్రానికి బిజినెస్ పరంగా  చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రి సినిమా ఎలా ఉంది.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? సుడిగాలి సుధీర్‌కు మాస్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టిందా? అనేది తెలియాలంటే సమీక్షలోకి వెళదాం.  

క‌థ‌:

తన లైఫ్ లో ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా తన ఊళ్ళో గాలోడు గా రజినీకాంత్ (సుడిగాలి సుధీర్‌) గ్రామంలో ఉంటూ అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతుంటాడు. న‌చ్చిన ప‌నులు చేస్తూ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. దీంతో అంద‌రూ అత‌న్ని గాలోడు అని పిలుస్తుంటారు. ఓ సంద‌ర్బంలో గాలోడుకి, సర్పంచ్ కొడుక్కి గొడ‌వ అవుతుంది. ఆ గొడ‌వ‌లో స‌ర్పంచ్ కొడుకు చనిపోతాడు. పోలీసులు అరెస్ట్ చేస్తార‌నే భ‌యంతో అత‌ను హైద‌రాబాద్ పారిపోయి వ‌చ్చేస్తాడు. అక్క‌డ అత‌నికి శుక్ల (గెహ‌నా సిప్పి) ప‌రిచ‌యం అవుతుంది. ఆమె ఓసారి క‌ష్టంలో ఉండే ర‌జినీకాంత్ ఆమెను కాపాడుతాడు. దీంతో ఆమె అత‌న్ని ఇంట్లో డ్రైవ‌ర్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. ర‌జినీకాంత్‌ వ్య‌స‌నాలు ఆమెను ఇబ్బంది పెట్టిన‌ప్ప‌టికీ.. అత‌ను నిజాయ‌తీగా ఉండ‌టంతో శుక్ల అత‌న్ని ప్రేమిస్తుంది. అదే స‌మ‌యంలో ర‌జినీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడ‌తారు. ఇంత‌కీ నిజంగానే ర‌జినీకాంత్ హత్య చేశాడా? నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డాడా? కోటీశ్వ‌రుడి కూతురైన శుక్ల‌తో అత‌ని పెళ్లి జ‌రుగుతుందా? ప్రేమ‌లో ప‌డ్డ త‌ర్వాత గాలోడులో వ‌చ్చే మార్పు ఏంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

నటి నటుల హావభావాలు:

బుల్లితెర పై చూసినవారికి సుడిగాలి సుధీర్ టాలెంట్ ఏ పాటిదో అందరికీ తెలిసిందే!. మరి సినిమాల్లో కూడా తన టాలెంట్ తో సుదీర్ ఇప్ప‌టికే రెండు సినిమాల్లో హీరోగా న‌టించి అల‌రించాడు. ఇక గాలోడు సినిమాలో కూడా కొత్త లుక్స్ అండ్ సాలిడ్ ప్రెజెన్స్ తో తాను ఆకట్టుకున్నాడు. అలాగే డాన్స్ లు కూడా చాలా బాగా చేసాడు.యాక్షన్ ఇంకా మాస్ యాటిట్యూడ్ లో తన యూత్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఈ సినిమాలో కనిపిస్తాడు. అలాగే నటుడుగా ఈ సినిమాలో తన నుంచి కొత్త కోణం కనిపిస్తుంది. త‌న లుక్ అంతా మార్చుకున్నాడు. డాన్సుల్లో ఇర‌గ‌దీశాడు. అలాగే యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే గెహనా డీసెంట్ నటనతో తన పాత్ర చేసింది.  ఆమె లుక్స్ మరియు సుధీర్ తో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది.  అలాగే ఇద్దరి మధ్య సాంగ్స్ కూడా వాటి మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. రిచ్ బిగ్గ‌ర్ నుంచి లాయ‌ర్‌గా మారి హీరోను కాపాడే పాత్ర‌లో స‌ప్త‌గిరి.. హీరోయిన్ ఇంట్లో వంట‌వాడిగా ష‌క‌ల‌క శంకర్ త‌దిత‌రులు చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సాంకేతికంగా చూస్తే రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల  క‌థ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. సినిమాను బిట్లు బిట్లుగా తీసి అతికించిన‌ట్లు ఉంది. మంచి క‌థ ఉండుంటే సినిమా సుధీర్ ఫ్యాన్స్‌కే కాదు.. ఆర్డిన‌రి అభిమానుల‌కు కూడా న‌చ్చి ఉండేది. సుధీర్ పాత్ర వరకు ఓకే కానీ సినిమాలో సరైన పాయింట్ కూడా తీసుకొని ఉన్నా పోనీ రొటీన్ లైన్ అయినప్పటికీ ఎంగేజింగ్ గా చూపించడంలో కూడా తాను విఫలం అయ్యాడు. లాజిక్స్ లేకుండా సిల్లీ నరేషన్ తో సినిమాలో ఫ్లో దెబ్బ తీసాడు. దీనితో తన వర్క్ మాత్రం చాలా బిలో యావరేజ్ గానే అనిపిస్తుంది. సినిమా వ్య‌వ‌ధి త‌క్కువ‌గా ఉండ‌టం ప్ల‌స్ అయ్యే అంశ‌మే అయినా, ఇంకాస్త ఎడిటింగ్‌లో తీసేసి ఉండుంటే బావుండేద‌నిపించింది. సినిమాకు భీమ్స్ సిసిరోలియో చాలా చ‌క్క‌టి పాట‌ల‌ను అందించారు. అన్నీ పాట‌లు చ‌క్క‌గా ఉన్నాయి. వాటి పిక్చ‌రైజేష‌న్ కూడా రిచ్‌గానే ఉంది. చిత్రంలో నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి.

విశ్లేషణ:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గాలోడు” లో ఒక్క సుధీర్ సిన్సియర్ పెర్ఫామెన్స్ తప్పా ఏ అంశం కూడా పెద్దగా ఆకట్టుకోదు. దర్శకుని పూర్తి వైఫల్యం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఈ చిత్రంలో విషయంలో సుధీర్ మాత్రం డెఫినెట్ గా రాంగ్ స్టెప్ తీసుకున్నాడని చెప్పొచ్చు. బహుశా తన పాత్ర వరకు ఓకే చేసాడో ఏమో కానీ అసలు ముఖ్యంగా ఈ చిత్రంలో కొత్తగా చెప్పిన కథే లేదు. పరమ రొటీన్ లైన్ కావడంతో ఇది పెద్ద డ్రా బ్యాక్ అనిపిస్తుంది. టైం పాస్ మూవీ చల్తా హై.   

 

 

Tags :