రివ్యూ: ఆధ్యంతం హాస్యభరితం 'గాలి సంపత్'

రివ్యూ: ఆధ్యంతం హాస్యభరితం 'గాలి సంపత్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5  
బ్యానర్ : ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్స్ &  షైన్ స్క్రీన్స్
నటి నటులు : రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ళ భరణి, సత్య, రఘుబాబు, కరాటే కళ్యాణి,
అనీష్ కురువిళ్ళ, రజిత, మిర్చి కిరణ్, శ్రీ కాంత్ ఐయ్యంగార్, శ్రీనివాస సాయి, గగన్, మధు, సురేంద్ర రెడ్డి,
రూప లక్ష్మి తదితరులు నటించారు. 
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం : అచ్చు శ్రీమణి, ఎడిటర్ : బి తమ్మి రాజు
నిర్మాతలు : యస్. కృష్ణ, హరీష్ పెద్ది, సాహు గారపాటి
కథ : యస్. కృష్ణ, స్క్రీన్ -ప్లే, మాటలు : అనిల్ రావిపూడి
దర్శకుడు: అనీష్ కృష్ణ
విడుదల తేదీ: 11.03.2021

గాలి సంపత్.. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది కాదు. ఇదొక వినూత్నమైన కథాంశంతో రూపొందింది. ఎన్నో భావోద్వేగాలతో, జీవితంలో అనుకోని సంఘటనలతో వ్యక్తపరిచే, హత్తుకునే కథ, కథనాలతో రూపొందిన చిత్రం. నటించడం వేరు.. నటనలో జీవించడం వేరు. మొదటి దాంట్లో కష్టం కనిపిస్తే రెండో దాంట్లో ఇష్టం కనిపిస్తుంటుంది. పాత్రను ఇష్టపడి నటిస్తే నోటి నుంచి మాటలు రావాల్సిన పనిలేదు. ఇదిగో ఈ ‘గాలి సంపత్‌’లా ఫీ..ఫీ..ఫీ అని నోటి నుంచి గాలి ఊదినా సరే అందులోని జీవం మాత్రం మనసుకి హత్తుకుంటుంది. నోట మాట రాకుండా ముఖంలోని హావభావాలతో ప్రేక్షకుడిని ఏడిపించడం, నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. కానీ, నటకిరీటి గాలి సంపత్ రాజేంద్ర ప్రసాద్ చేసి చూపించారు. ఎన్నో ఏళ్ళుగా తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటకిరీటి నటనకు నిలువెత్తు నిదర్శనమే ఈ గాలి సంపత్. హాస్యానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, వరుస సూపర్ హిట్స్ అందిస్తున్న అనిల్ రావిపూడి నేతృత్వం లో రూపొందిన ఈ చిత్రం మహా శివరాత్రి పర్వదినాన ఈ రోజు విడుదల అయ్యింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఆకాశవాణిలో తన గొంతుతో శ్రోతల్ని అలరించే గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్)..  అనే ఓ నాటక శూత్రధారుడు ప్రేక్షకులకు కనిపిస్తారు. విచిత్రమేంటంటే ఈ గాలి సంపత్ కి మాట రాదు. తనతోనే చిన్ననాటి నుండి ఉన్న ఓ క్యారెక్టర్ గాలి సంపత్ పలికే భాషకు డబ్బింగ్ చెబుతాడు. ఓ ప్రమాదంలో భార్యతో పాటు తన గొంతును పోగొట్టుకుంటాడు. మాట్లాడితే నోటిలో నుంచి ‘ఫీ ఫీ ఫీ’ అని గాలి మాత్రమే వస్తుంది. అందుకే ఇతన్ని గాలి సంపత్ అంటుంటారు. ఇతనికి నాటకాలంటే పిచ్చి.. గొంతులేకపోవడం వల్ల నాటకాల్లో రాణించాలనే కలను సాకారం చేసుకోలేకపోతుంటాడు. ఇతని కొడుకే సూరి (శ్రీవిష్ణు). అరకులో ట్రక్ డ్రైవర్. కుటుంబ బాధ్యత మోస్తూ ట్రక్ ఓనర్ కావాలనేది ఇతని కల. ఈ కలను సాకారం చేయడానికి నాటకాలు వేసి కొడుక్కి సొంత ట్రక్ కొనివ్వాలని సంపత్ ప్రయత్నిస్తుంటాడు. సూరికి మంచి లవ్‌ట్రాక్ కూడా ఉంటుంది.

తండ్రీకొడుకుల మధ్య దూరం పెరగడానికి ఈ లవ్ కూడా ఓ కారణం. ప్రెసిడెంట్ కూతురు పాప (లవ్‌లీ సింగ్) ప్రేమలో పడతాడు సూరి. వీరి పెళ్లి గాలి సంపత్ కారణంగా చెడిపోతుంది. అదే సందర్భంలో సూరి ట్రక్ కొనడం కోసం అప్పుగా తెచ్చిన డబ్బుని నాటకంలో వేషం కోసం వాడుకుంటాడు గాలి సంపత్. దీంతో తండ్రిపై కోపం పెంచుకుంటాడు సూరి. అప్పుడే వీళ్ల మధ్య వైరం మరోసారి విలన్‌లా మారి.. గాలి సంపత్‌ని తీసుకుని వెళ్లి ఓ గోతిలో పడేస్తాడు.  ఇంతలో కొడుకుకి ఓ వింత సంఘటన ఎదురవుతుంది. ఇంతకీ ఏంటీ ఆ సంఘటన, గాలి సంపత్ త్యాగాన్ని, ప్రేమని కొడుకు గుర్తించాడా లేదా?  ఆ గోతిలో నుంచి సంపత్ ఎలా బయటకు వచ్చాడు? ఇద్దరి కలలు ఎలా సాకారం అయ్యాయి? కనిపించకుండా పోయిన తండ్రి కోసం కొడుకుపడిన తపన ఏంటి? కొడుకు కోసం ఆ తండ్రి గతంలో చేసిన త్యాగాలేంటి? వాటిని సూరి ఎలా తెలుసుకున్నాడు? అన్నదే మిగిలిన కథ.

నటి నటుల హావభావాలు:

రాజేంద్ర ప్రసాద్ విశ్వరూపం దాల్చిన విధానం. నటికిరీటికి  నట విశ్వరూపం ఈ సినిమా ఎందుకంటె...  ఎమోషనల్ కంటెంట్, కథ, కథనం ఈ సినిమాకి బలంగా నిలిచాయి. రాజేంద్ర ప్రసాద్ నవ్వుతూ, అలరిస్తూ, ఏడ్పించే విధానం అధ్భుతం. ఇంతకు ముందు వరకూ ఓ లెక్క.. ఈ సినిమాతో మరో లెక్క అన్నట్టుగా తన అద్భుత నటనతో తన అభినయం ఆకాశం అనేట్టుగా చేశారు రాజేంద్ర ప్రసాద్. మొదట్లో ‘ఫీ ఫీ ఫీ’ అంటుంటే.. సినిమా మొత్తం ఇలాగే భరించాలా? అని అనిపిస్తుంది. కానీ ఆ తరువాత గాలి సంపత్ నట విశ్వరూపం చూపిస్తాడు. కేవలం హావభావాలతోనే ప్రేక్షకుల్ని కుర్చీల నుంచి కదలకుండా చేశాడు. నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. తన హావభావాలతో వారెవ్వా అనేట్టుగా చేశారు నటకిరీటి. ఇక  శ్రీవిష్ణు పర్ఫార్మెన్స్ విషయానికొస్తే....తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు.  పాత్రోచితంగా ఈ సినిమాతో కూడా మంచి పాత్రను ఎంచుకుని ఆ పాత్రలో పర్ఫెక్షన్ చూపించాడు శ్రీ విష్ణు.

నిజానికి ఈ సినిమా మొత్తం గాలి సంపత్ పాత్ర చుట్టూనే నడుస్తుంది. శ్రీ విష్ణుది కొడుకు పాత్ర మాత్రమే. స్క్రీన్ స్పేస్ కూడా గాలి సంపత్ పాత్రతో పోల్చుకుంటే తక్కువ. అయితే ఇందులో గాలి సంపత్‌కి కొడుకుగా ఇతనైతేనే పర్ఫెక్ట్ అనేట్టుగా చేశాడు శ్రీవిష్ణు. హీరోయిన్ లవ్‌లీ సింగ్ హీరోతో లవ్ ట్రాక్ కోసమే పెట్టినా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర. పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. సినిమాలో కమెడియన్ సత్య పాత్ర చాలా కీలకం. గాలి సంపత్ పాత్రకి ట్రాన్స్‌లేటర్‌గా ఇరగదీశాడు. కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు సత్య. గాలి సంపత్ స్నేహితుడిగా తనికెళ్ల భరణి కీలకపాత్రలో కనిపించారు. కరాటే కళ్యాణి పంకజం పాత్రలో మరోసారి వ్యాంప్ తరహా క్యారెక్టర్‌లో నటించింది. ఇంకా రఘు బాబు,  అనీష్ కురువిళ్ళ, రజిత, మిర్చి కిరణ్,  శ్రీ కాంత్ ఐయ్యంగార్, శ్రీనివాస సాయి, గగన్, మధు, సురేంద్ర రెడ్డి,  రూప లక్ష్మి తమ తమ పాత్రల మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఇక టెక్నికల్ గా చెప్పాల్సివస్తే.... నిర్మాత ఎస్.కృష్ణ కథ అందించిన విషయం తెలిసిందే. సినిమా తెరకెక్కిన విధానం అల్టిమేట్ గా ఉంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చాలా బావుంది. అనిల్ రావిపూడి అంటే పక్కా కమర్షియల్ దర్శకుడు అనే మార్క్ ఉంది. టాలీవుడ్‌లో అపజయం అన్నది చూడని దర్శకుడు ఈయన. తొలిసారిగా (F2) దర్శకుడి కథనం, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రమే ‘గాలి సంపత్’. ఆయనతో పాటు కో-డైరెక్టర్‌గా, రచయితగా ట్రావెల్ చేసిన ఆయన మిత్రుడు ఎస్.కృష్ణను ఈ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం చేశారు అనిల్ రావిపూడి. అనీష్ కృష్ణ  దర్శకత్వం వహించారు. దర్శకత్వ పర్యవేక్షణ లో  ప్రతి సీనులో ఆయన మార్క్ తెలుస్తుంది. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. కథలో బలం ఉండటం, దానికి రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ తో సినిమాకి ప్రాణం పోశారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన అచ్చు రమణి కి హాట్సాఫ్. ఎందుకంటే ప్రతి సినిమాకి మ్యూజిక్ నడిపిస్తుంది. ఈ సినిమాకి ప్రాణం రీ-రికార్డింగ్. గాలి సంపత్ గోతిలో పడ్డ తరువాత డైలాగ్స్ ఏమీ ఉండవు. ఆయన గొంతుతో చేసే శబ్ధాలు చాలా వింతగా.. పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ హావభావాలకు తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి. ఫీ ఫీ ఫీ పాట తప్ప మిగిలిన పాటలు ఓ మోస్తరుగా ఉన్నా.. రీ రికార్డింగ్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఈ సినిమాని హైలెట్ చేశాయి. ‘గాలి సంపత్’ చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువల్లో ఎక్కడా లోపాలు కనిపించవు.

విశ్లేషణ:

ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్‌లో నటకిరీటి విశ్వరూపం చూడొచ్చు. నాటకంలో సింగిల్ డైలాగ్ లేకుండా ఏడెనిమిది నిమిషాల పాటు.. ఏకపాత్రాభినయంతో ఔరా అనేట్టుగా చేశారు. ఆ సీన్‌తో నటనలో నా స్థాయి ఆకాశం అనేట్టుగా చేశారు రాజేంద్ర ప్రసాద్. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో కళ్లు చెమ్మగిల్లేట్టు చేశారు. గోతిలో పడ్డ తరువాత అందులో నుంచి బయటకు రావడానికి గాలి సంపత్ చేసిన ప్రయత్నాలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. అదే సందర్భంలో ఏడిపిస్తాయి కూడా. గోతిలో నుంచి ఆయన గొంతు పైకి వినిపించడం కోసం చేసే శబ్ధాలు నటకిరిటీని మరో మెట్టు ఎక్కించేట్టుగా ఉన్నాయి. ఈ వయసులో ఇలాంటి పాత్ర చేయడం రాజేంద్ర ప్రసాద్‌కి ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఆయన కెరియర్‌లో గాలి సంపత్ పాత్ర నిజంగా ఒక ఆణిముత్యం. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఎమోషనల్ కంటెంట్, కథ, కథనం,  శ్రీవిష్ణు పర్ఫార్మెన్స్, ఈ సినిమాకి బలంగా నిలిచాయి. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు గాలి సంపత్ కామెడీని, ఎమోషన్స్‌ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 

 

Tags :