రివ్యూ : మరో స్పోర్ట్స్ డ్రామా 'గని'

రివ్యూ : మరో  స్పోర్ట్స్ డ్రామా 'గని'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, జగపతి బాబు, నదియ, నవీన్‌ చంద్ర, నరేశ్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్ సంగీతం : తమన్‌ ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌
నిర్మాతలు : అల్లు బాబీ, సిద్దు ముద్ద దర్శకత్వం : కిరణ్‌ కొర్రపాటి
విడుదల తేది : 08.04.2022

మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్‌ తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్‌ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా స్పోర్ట్స్ డ్రామా తో వరుణ్‌ తేజ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

క‌థ‌:

గ‌ని (వ‌రుణ్ తేజ్‌) గీతం కాలేజ్‌లో ఇంజ‌నీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతుంటాడు. చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న విక్రమాదిత్య(ఉపేంద్ర) విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ వల్ల ‘గని’ బాక్సింగ్‌కు దూరమవుతాడు. దీంతో గనికి తండ్రి మీద విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది. గ‌ని బాక్సింగ్ ఆడ‌కూడ‌ద‌ని అత‌ని త‌ల్లి మాధురి (న‌దియా) మాట తీసుకుంటుంది. త‌న బాధ‌ల‌ను, అవ‌మానాల‌ను తుడిచి పెట్టాలంటే బాక్సింగ్‌లో నేష‌న‌ల్ చాంఫియ‌న్ కావాల‌నే ల‌క్ష్యం పెట్టుకుని త‌ల్లికి తెలియ‌కుండా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. స్టేట్ ఛాంపియ‌న్ కావ‌డానికి జ‌రిగే పోటీల్లో వైజాగ్‌లో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కొడుకు (న‌వీన్ చంద్ర‌)తో పోటీ ప‌డాల్సి వ‌స్తుంది. అప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య వైరం ఉంటుంది. అయితే గేమ్‌లో ఎమోష‌న‌ల్ బ్యాలెన్స్ కోల్పోవ‌డంతో గ‌ని ఫైన‌ల్ నుంచి డిస్‌క్వాలిఫై అవుతాడు. గ‌ని బాక్సింగ్ నేర్చుకుంటున్నాడనే విష‌యం త‌న త‌ల్లికి తెలిసిపోతుంది. అదే స‌మ‌యంలో విజ‌యేంద్ర (సునీల్ శెట్టి) కార‌ణంగా తండ్రి విక్ర‌మాదిత్య ఆశ‌యమేంటి? త‌న‌కు జ‌రిగిన అన్యాయ‌మేంటి? మోసం చేసిన వ్య‌క్తి ఎవ‌రు? అనే విష‌యాలు గ‌నికి తెలుస్తాయి. అప్పుడు త‌ను ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు? చివ‌ర‌కు గ‌ని త‌న తండ్రి ఆశ‌యాన్ని నేర‌వేర్చాడా? లేదా? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు:

బాక్సర్‌ గనిగా వరుణ్‌ తేజ్‌ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్‌ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్‌లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేక‌ర్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్‌ పాత్రకు సునీల్‌ శెట్టి న్యాయం చేశాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈశ్వర్‌ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. హీరో తల్లిగా నదియా, బాక్సర్‌గా నవీన్‌ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

సాంకేతికంగా చూస్తే డెబ్యూ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ క‌థను ఎలా చెప్పి మేక‌ర్స్‌ను ఒప్పించారా? అని సినిమా చూశాక స‌గ‌టు ప్రేక్ష‌కుడిలో క‌లిగే సందేహం. ఎందుకంటే సినిమాలో ఎక్క‌డా ఎగ్జ‌యిటింగ్ పాయింట్ క‌నిపించ‌దు. ఫ‌స్టాఫ్‌లో హీరో హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌, త‌ల్లీ కొడుకు మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే స‌న్నివేశాల‌న్నీ ఇది వ‌ర‌కు సినిమాల్లో చూసిన‌ట్లే అనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్‌లో హీరో తన తండ్రిపై ద్వేషాన్ని పెంచుకునే కార‌ణాల‌ను పెద్ద‌గా చూపించ‌లేదు. స‌రే! పిల్లాడు మ‌న‌సు.. చుట్టుప‌క్క‌ల వాళ్లు అవ‌మానించ‌డంతో తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడేమో అనుకోవాలంతే. అయితే దాన్ని ఎక్క‌డా ఎక్కువ‌గా ప్రొజెక్ట్ చేయ‌లేదు. ఉపేంద్ర బాక్సింగ్ ఛాంపియ‌న్ కావాల‌నుకోవ‌డం.. మోస‌పోవ‌డం .. తండ్రి ఆశ‌యం కోసం హీరో రంగంలోకి దిగడం వంటి స‌న్నివేశాల్లో ఎక్క‌డా ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ లేదు. సినిమాలో స‌న్నివేశాలు వ‌స్తున్నాయి.. పోతున్నాయ‌నే కోణంలో ఉంది. క‌థ‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై అద్భుతంగా ప్ర‌జెంట్ చేయ‌డం మంచిదే. కానీ.. అంత కంటే ముఖ్యం సినిమాకు ఎంతో కీల‌క‌మైన ఎమోష‌న‌ల్ పాయింట్స్‌ మిస్ అయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ సంగీతం. పాటలు యావరేజ్‌గానే ఉన్నప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. స్పోర్ట్స్‌ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

విశ్లేషణ :

సాధారణంగా స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్‌. కానీ ‘గని’ క్యారెక్టర్‌ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి. ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సీన్స్‌, తల్లి కొడుకుల సెంటిమెంట్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఇక హీరోయిన్‌తో ప్రేమాయాణం అయితే అతికినట్లే ఉంది తప్ప వారి లవ్‌కి ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్‌ కాలేడు. కమర్షియల్‌ సినిమా అన్నాక ఓ హీరోయిన్‌ ఉండాలి అనే కోణంలో ఆమె క్యారెక్ట్‌ని సృష్టించారు తప్ప.. ఈ కథకి అసలు ఆ పాత్రే అవసరం లేదనిపిస్తుంది. ఇక తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా అంతగా పండలేదు. నవీన్‌చంద్ర, వరుణ్‌ల మధ్య వచ్చే ఫైట్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి.ఎలాంటి సర్‌ప్రైజ్‌ లేకుండా ఫస్టాఫ్‌ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్‌ సీన్‌తో సెకండాఫ్‌ స్టార్ట్‌ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. అన్నిటికి మించి సినిమాలో రొటీన్ కంటెంటే ఎక్కువగా ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే వరుణ్ తేజ్ గనిగా చాలా బాగా నటించాడు. బిలో ఏవరేజ్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

 

Tags :