తెలంగాణ సమాజం తెలంగాణ ఎన్నారైల వైపు చూస్తోంది... గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ సభలో విశ్వేశ్వర్ కలవల

ప్రపంచంలోని తెలంగాణ ఎన్ఐఆర్ లందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని.. సొంత రాష్ట్రమన్న కలను సాకారం చేశారని, ఇప్పుడు తెలంగాణ సమాజ అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి ఎన్నారైలు చేయనున్న కృషిని చూస్తోందని అంటూ, ప్రపంచంలో ఉన్న ఎన్నారైలను ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు వీలుగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జిటిఎ) ఏర్పడిరదని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకులు విశ్వేశ్వర్ కలవల అన్నారు. సాగర హారం మొదలుకొని.. మిలియన్ మార్చ్ వరకూ అన్ని ఉద్యమ స్వరూపాల్లో పాలుపంచుకున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నారైలంతా కలిసి తెలంగాణ అభివృద్ధికి ముందుకురావాలని ఇందుకోసమే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పడిరదని అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని డ్రీమ్ వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్‌లో జరిగిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి తెలంగాణ ఎన్నారైలు ఈ సభకు తరలివచ్చారు. తెలంగాణ అనేది ఒకరి సొత్తు కాదని, అందరి ప్రయత్నం వల్ల తెలంగాణ స్వరాష్ట్రం అన్న కల సాకారమైందన్నారు. తెలంగాణ సమాజం కొన్ని రోజుల వరకూ కొద్ది దేశాలకే పరిమితమైందని, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సమాజం విస్తరించిందన్నారు. సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, తెలంగాణ ఎన్నారైలు మరింత విస్తరించాలన్న సదుద్దేశంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పడిరదని వివరించారు. జీటీఏ కోసం గత 2 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయని, చివరికి సాధ్యమైందన్నారు. తెలంగాణ సమాజం యావత్తూ ఇప్పుడు వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైల వైపు చూస్తోందని, అభివృద్ధి ఫలాలను తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యతమై తమపై ఉందన్నారు.
ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వున్న తెలంగాణ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని విశ్వేశ్వర్ కలవల నొక్కి చెప్పారు. తామందరూ అమెరికాలో అద్భుతంగా స్థిరపడ్డామని, గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ వారికి సాయం చేయాల్సిన అవసరం తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. ఇప్పటికే వారికి సహాయ సహకారాలను అందిస్తున్నామని, అయితే... మరింత సహాయం చేయాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ సిద్ధించడం తమకెంతో సంతోషాన్నిస్తోందన్నారు. గతంలో అమెరికాలో తెలంగాణ అన్న పదం ఉచ్చరించడానికే ఇబ్బందులు పడేవారిమని, బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయని, బతుకమ్మ ప్రపంచవ్యాప్తమైందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు తెలంగాణకు చేస్తున్న సేవను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు అరవింద్, ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, చంద్ర, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత, మాజీ మేయర్ కార్తీక, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, భువనగిరి జడ్పి చైర్ పర్సన్ సందీప్ రెడ్డి, తేజావత్ రామచంద్రు ఐఎఎస్, వికారాబాద్ ఎస్పి కోటి రెడ్డి, యోయో టీవి వ్యవస్థాపకులు, అసోసియేషన్ ఫౌండర్లలో ఒకరైన మల్లారెడ్డి అలుమల్ల, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తదితరులు పాల్గొని ఎన్నారైలు మరింతగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.