MKOne Telugu Times Youtube Channel

ఆపరేషన్ గులాబీ..?

ఆపరేషన్ గులాబీ..?

కర్నాటకలో విజయం తర్వాత  తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెల్లుబుకుతోంది. కర్నాటక, తెలంగాణలో పరిస్థితులు ఒకేలా ఉంటాయని.. అందుకే అక్కడి వ్యూహాలు ఇక్కడ పనిచేస్తాయని ఇప్పటికే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగానే చెప్పారు. ఇప్పుడు అదే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అవినీతిని ప్రజల్లో ఎండగడుతూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు  కలిసివస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు.

ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిపై రేవంత్ గట్టిగానే స్పందించారు. ఓఆర్ఓర్ లీజు ఒప్పందం అవినీతిమయమని ఆరోపించారు. సొంతవారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈడీల్ చేశారని కేసీఆర్ పై ఫైరయ్యారు. ఈవ్యవహరంలో వెయ్యికోట్లు చేతులుమారాయని ఆరోపణలు చేశారు. తొలుత ఈలీజ్ ద్వారా పదివేల కోట్లు ఆదాయం వస్తుందన్నారని.. తర్వాత 9 వేల కోట్లుగా మార్చారన్నారు. ఇప్పుడు 7,380కోట్లు వస్తుందంటున్నారని.. దీనివెనక ఉన్న రహస్య అజెండా బయటపెట్టాలన్నారు.

ఇప్పుడు జీవో 111 రద్దు అంశంపైనా రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యవహారం వెనక భారీ భూకుంభకోణముందన్నారు. హైదరాబాద్ భవిష్యత్ ను పణంగా పెడుతున్నారని.. ఇది చాలా దుర్మార్గమన్నారు. దీనిలో గులాబీ పార్టీ నేతలకు 80శాతం భూములున్నాయని.. అందుకే జీవో 111 రద్దు చేశారని ఆరోపించారు.

వరుసగా బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై అస్త్రాలను సంధిస్తూ ముందుకెళ్తున్నారు రేవంత్. ఈ అంశాలను తాము ఊరికే వదిలిపెట్టబోమని ..ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ పోరాడుతామన్నారు. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీటిపై విచారణ సైతం చేపడతామని స్పష్టం చేశారు.కర్నాటకలో 40శాతం కమిషన్ సర్కార్ అంటూ అక్కడి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసి సక్సెసయ్యారు. ఇప్పుడు ఇక్కడ 30శాతం కమిషన్ సర్కార్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు ఎలా స్పందిస్తారన్నది వచ్చే ఎన్నికల్లో తేలనుంది.

 

 

Tags :