తెలంగాణ ప్రభుత్వంతో కాలిఫోర్నియా వర్సిటీ ఒప్పందం

అమెరికాలో తెలంగాణ ప్రతినిధి బృందం పర్యటనలో కూడా పెట్టుబడులు రావడంతో పాటు పలు భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలోని బృందం పలు సంస్థలతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా డిజిటల్ సేవల రంగంలో పేరొందిన గ్రిడ్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో ఉన్న ప్రస్తుత డెలివరీ సెంటర్ కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ చైర్మన్ లాయిడ్ కార్నీ, సీటీవో రాజీవ్ శర్మ, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు తెలంగాణలో జీరో ఎమిషన్ వెహికల్ (జెడ్‌ఈవీ) పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రకటించింది. రెండేళ్లపాటు పరిశోధన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒప్పందం కుదుర్చుకుంది.