రివ్యూ: ఈ 'గల్లీ రౌడీ'ది పాత కథే

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్
నటీనటులు : సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, వెన్నెల కిషోర్, పొసాని కృష్ణ మురళి, మైమ్ గోపి తదితరులు సంగీతం : రామ్ మిరియాల, సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ నిర్మాతలు : యమ్.వి.వి సత్యనారయణ, కోన వెంకట్ దర్శకత్వం: నాగేశ్వర రెడ్డి
విడుదల తేది : 17.09.2021
విలక్షణత మైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ యంగ్ హీరో సందీప్ కిషన్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో ముందుండే సందీప్ కిషన్, అయితే కొద్దికాలంగా ఈ యువ హీరో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన చేసిన సీనిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ‘గల్లీ రౌడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? చొక్కా , బుగ్గ మీద గాటు పెట్టుకొని కాకుండా కొంచం స్టైలిష్‌గా వచ్చిన ఈ ‘గల్లీ రౌడీ’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
కథ:
మీసాల సింహాచలం(నాగినీడు) వైజాగ్‌లో రౌడీ. పేదలకు అండగా నిలబడుతుంటాడు. అతనికి బలం అతని కొడుకు అప్పన్న(ప్రకాశ్‌రాజ్). కారు ప్రమాదంలో అప్పన్న చనిపోవడం. సింహాచలం వయసు మీరడంతో అతని దగ్గర పనిచేసే బైరాగి నాయుడు(మైమ్ గోపి) సింహాచలంను పదిమందిలో అవమానించి వైజాగ్‌లో రౌడీగా ఎదుగుతాడు. ఎదిగే కమ్రంలో బైరాగి అనేక అక్రమాలకు పాల్పతాడు. చాలా మంది అమాయకులను చంపేస్తాడు. అయితే సింహాచలం దగ్గర పనిచేసే నాయుడు(పోసాని) ఎలాగైనా సింహాచలం మనవడు వాసు(సందీప్ కిషన్)ను రౌడీగా తయారు చేసి బైరాగిని మించిన రౌడీగా చేయాలనుకుంటాడు. అందుకు సింహాచలం కూడా ఒప్పుకోవడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనుకున్న వాసు చదువు చిన్నప్పుడే అటకెక్కుతుంది. పెద్దయినప్పటికీ వాసు గొడవల జోలికి వెళ్లడు. ఓ సందర్భంలో సాహిత్య(నేహాశెట్టి)ని చూడగానే ప్రేమిస్తాడు. ఆమెకు ఓ సమస్య ఉంటే అప్పుడు గొడవపడి సాల్వ్ చేస్తాడు. దాంతో వాసు మీద పోలీసులు రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తారు. అయితే తాను రౌడీలను ప్రేమించనని సాహిత్య చెప్పేస్తుంది. సాహిత్య తండ్రి పట్టపగలు వెంకట్రావు(రాజేంద్ర ప్రసాద్) హెడ్ కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తుంటాడు. బీచ్ దగ్గర అతనికి రెండు కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఉంటుంది. దాన్ని బైరాగి కబ్జా చేస్తాడు.
అడగటానికి వెళ్లిన వెంకట్రావును కొట్టి, బలవంతంగా భూమిని తన పేరుపై రిజిస్టర్ చేయించుకుంటాడు. దాంతో వెంకట్రావు భార్య, అమ్మ, కూతురు, కొడుకు ఆయన మాట వినకుండా, బైరాగిని కిడ్నాప్ చేయాలనుకుంటారు. అందుకు వాసు హెల్ప్ అడుగుతారు. వాసు కూడా ఒప్పుకుంటాడు. అయితే కిడ్నాప్ ప్లాన్ జరిగే క్రమంలో బైరాగిని ఎవరో చంపేస్తారు. ఆ కేసుని డీల్ చేయడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రవి(బాబీ సింహ) రంగంలోకి దిగుతాడు. ఇంతకీ బైరాగిని ఎవరు చంపుతారు? బైరాగికి, రవికి ఉన్న లింకేంటి? వెంకట్రావు కుటుంబాన్ని వాసు ఎలా కాపాడాడు? సాహిత్య మనసుని వాసు గెలుచుకున్నాడా? లేదా? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటి నటుల హావభావాలు:
గల్లీరౌడీ వాసుగా సందీప్ కిషన్ చాలా ఈజీ నటించాడు. వంశంపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తి నచ్చక సాఫ్ట్వేర్ కావాలనుకొని, తాతకోసం మళ్లీ రౌడీగా మారడం, ఇష్టపడిన అమ్మాయి కోసం రిస్క్ చేయడం.. ప్రతి సీన్లో చాలా నేచురల్‌గా నటించాడు. హీరోగా కాకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది అతని పాత్ర. ఫైట్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక సాప్ట్వేర్ సాహిత్య పాత్రలో నేహా శెట్టి అద్భుత నటనను కనబరిచింది. తెరపై చాలా అందంగా కనిపించింది. హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావుగా రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో నవ్వులు పూయించాడు. రాజేంద్ర ప్రసాద్ కామెడీతో పాటు వెన్నెల కిషోర్, శివన్నారాయణ కామెడీ కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది.
రౌడీ సీఐ రవిగా బాబీ సింహా మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. భూకబ్జాలకు పాల్పడే రౌడీ బైరాగి నాయుడిగా మైమ్ గోపి తనదైన నటనతో మెప్పించాడు. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష, చిత్ర కళాకారుడిగా వెన్నెల కిషోర్ తమదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. పొసాని, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
కామెడీ సినిమాలను తెరకెక్కించడంతో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడు. సందర్భానుసారం వచ్చే కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయినప్పటికీ తనదైన స్క్రీన్‌ప్లేతో కొంతవరకు మ్యానేజ్ చేశాడు కోన వెంకట్. ఇంటర్వెల్ సీన్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. రౌడీలుగా ముసలి బ్యాచ్‌ను పెట్టడం కామెడీకి స్కోప్ దొరికింది. సెకండాఫ్ కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బావుంది. లాజిక్స్‌కు సినిమా దూరంగా కనిపిస్తుంది. అయితే కమర్షియల్ సినిమా కాబట్టి అలాగే ఉంటుందనుకోవడమే. సాధారణంగా కోన వెంకట్ స్క్రీన్‌ప్లేలో సెకండాఫ్ కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది.
విశ్లేషణ:
ఈ మధ్య కాలం కరోనా సమయంలో అందరూ నవ్వుకునే కమర్షియల్ ఎంటర్టైనర్స్ రాలేదు. అలాంటి ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో హీరో సందీప్ కిషన్ తనకు నచ్చిన కథతో మేసిన ముందడుగే ‘గల్లీ రౌడీ’. రౌడీ కావడం ఇష్టం లేని ఓ కుర్రాడు. ప్రేమించిన అమ్మాయి కోసం రౌడీగా మారిపోవడం.. అలాగని ఈ రౌడీ సీరియస్‌గా సెటిల్మెంట్స్ చేయడు. ఎంటర్టైన్ చేస్తాడు. హీరో తన ప్రేమ కోసం హీరోయిన్ కుటుంబంతో చేసే పనులు ప్రేక్షకులను నవ్విస్తాయి. మీసాల వాసు పాత్రలో సందీప్ కిషన్ తన పాత్రతో ప్రేక్షకులను ఆసాంతం మెప్పించాడు. హీరో రివేంజ్ పాయింట్ సినిమాలో ప్రధానమైన పాయింటే అయినా, హీరోయిన్ ఫ్యామిలీ వ్యూలో సినిమా సాగుతుంది. నేహా శెట్టి పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. ఇక సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నటించిన రాజేంద్ర ప్రసాద్ భయపడే హెడ్ కానిస్టేబుల్ పాత్రలో నవ్వించడమే కాదు, నష్టపోయిన సగటు మధ్య తరగతి వ్యక్తిగా ఎమోషనల్గానూ ఆకట్టుకున్నాడు. మెయిన్ విలన్‌గా నటించిన మైమ్ గోపి.. విలనిజాన్ని చక్కగా పండించాడు.
తమిళ నటుడైన ఈయనకు తెలుగులో చాలా మంచి రోల్ వచ్చిందనే చెప్పాలి. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన బాబీ సింహకు కూడా మంచి ఎలివేషన్ దక్కింది. అయితే తన పాత్రకు కాస్త ఎక్కువ బిల్డప్ ఇచ్చారేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, సాంగ్స్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ సాఫీగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీ ఉంటుంది. కానీ బాబీ సింహా పాత్ర, ఇన్వెస్టిగేషన్ అంటూ సాగడంతో కాస్త సినిమా సాగదీతగా అనిపిస్తుంది. మొత్తానికి సినిమా కథా కథనాలతో కొత్తదనం లేకపోయినా కాస్త నవ్వుకోడానికి ఈ చిత్రం చూడొచ్చు.