రివ్యూ : ఈ 'గుర్తుందా శీతాకాలం' గుర్తుండదు!

రివ్యూ : ఈ 'గుర్తుందా శీతాకాలం' గుర్తుండదు!

తెలుగుటైమ్స్.నెట్  రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థలు  : వేదాక్షర మూవీస్, నాగశేఖర మూవీస్,
తారాగణం: సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, సుహాసిని, ప్రియదర్శి, హర్షిణి
కెమెరా: సత్య హెగ్డె, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: కాలభైరవ, నిర్మాత: భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి
దర్శకత్వం: నాగశేఖర్
విడుదల తేదీ: 09.12.2022

2020లో వచ్చిన కన్నడ సినిమా "లవ్ మాక్టెయిల్" కి రీమేక్ ఈ "గుర్తుందా శీతాకాలం". పాండమిక్ పీరియడ్ లో స్టార్ట్ అయ్యి మొదలై ఇప్పటికి సరిగ్గా శీతాకాలంలో వచ్చింది.  సత్యదేవ్ సినిమాలంటే కొత్తదనం కచ్చితంగా ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది. రొటీన్ కథలకు భిన్నంగా నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలనే ఆయన ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అలాంటి హీరో నుంచి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సాఫ్ట్ టైటిల్‌తో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దీనికి తోడు తమన్నా హీరోయిన్ అనగానే ఈ కొత్త కాంబినేషన్‌ తెరపై ఎలా ఉంటుందో అనే ఎగ్జయిట్‌మెంట్ కూడా ప్రేక్షకుల్లో పెరిగింది. మరి, కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా గుర్తుండిపోయేలా ఉందా లేదా రివ్యూ లో చూద్దాం.

కథ:

చిన్నప్పటి నుంచీ ఆడుతూ పాడుతూ పెరిగిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన జీవితంలో ఆస్వాదించిన మూడు ప్రేమకథల సమాహారమే ఈ ‘గుర్తుందా శీతాకాలం’ కథ.   హీరో సత్యదేవ్ (సత్యదేవ్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో వర్క్ చేస్తుంటాడు. కాలేజ్ లో అమృత (కావ్యా శెట్టి)ని ప్రేమిస్తాడు. ఆమే లోకంగా బతుకుతాడు.అయితే, సత్యదేవ్ లైఫ్ లో సెటిల్ కాలేదు అని అమృత అతనికి నో చెపుతుంది. ఆ తర్వాత సత్యదేవ్ లైఫ్ లోకి నిధి (తమన్నా) వస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అనంతరం వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి?, నిధి కి ఏం జరిగింది ?, చివరకు సత్యదేవ్ ఎలా మారాడు?, ప్రశాంత్ (ప్రియదర్శి) పాత్ర ఏమిటి?, అలాగే ఈ మధ్యలో దివ్య (మేఘా ఆకాష్) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు:

స్టూడెంట్ లుక్‌లో కనిపించిన సత్యదేవ్ తన యాక్టింగ్ స్కిల్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రియదర్శితో కలిసి కామెడీని పండించారు. వారిద్దరి మధ్య వచ్చే డైలాగులు చాలా సరదాగా ఉన్నాయి. సత్యదేవ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ప్రియదర్శిని ఎంపిక చేసుకోవడం డైరెక్టర్ బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. హీరోయిన్ తమన్నా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించింది. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాగే, మరో హీరోయిన్ పాత్రలో నటించిన కావ్య శెట్టి కూడా చాలా బాగా నటించింది. ఇక మేఘా ఆకాష్ నటన కూడా బాగుంది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. సుహాసిని, ప్రియదర్శి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :

ప్రేమకథలు.. వాటిలోని తీయని అనుబంధాలు.. ఆ తరవాత వచ్చే బాధలు.. అన్నీ చక్కగా చూపించారు. దేవ్ స్కూల్, కాలేజ్ లవ్‌స్టోరీలను కామెడీగా నడిపించిన దర్శకుడు నాగశేఖర్.. దేవ్ జీవితంలో సెటిల్ అయిన తరవాత వచ్చే ప్రేమకథను ఎమోషనల్‌గా చూపించారు. సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఈ చిత్రంలో బాగా అక్కటుకుంది  డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల. ‘‘లవ్‌లో ప్రాబ్లమ్ ఉంటే మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు.. లవరే ప్రాబ్లమ్ అయితే’’ లాంటి సింపుల్‌గా మన మైండ్‌లోకి ఎక్కేసే డైలాగులు చాలానే ఉన్నాయి. వాటితో పాటు ఇంత క్లాస్ సినిమాలో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ‘డిక్కీ బలిసిన కోడి’, ‘నీలో చాలా షేడ్స్ ఉన్నాయిరా ప్రకాశ్ రాజ్’, ‘జబ్ భగవాన్ దేగా తో తప్పడ్ మార్‌ కే దేకా’ వంటి సరదా డైలాగులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రియదర్శి మాట్లాడేటప్పుడు వచ్చే చిన్న చిన్న పదాలు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకు మూడో బలం సంగీత దర్శకుడు కాలభైరవ. ఆయన అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించాయి. ఆ పాటలు సినిమాలో కథతో పాటు ట్రావెల్ చేశాయి. నేపథ్య సంగీతం కూడా ఆహ్లాదకరంగా ఉంది. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఊటీ, మంగళూరు అందాలను చాలా బాగా తన కెమెరాలో బంధించారు. ముఖ్యంగా ఏరియల్ షాట్స్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

గుర్తుందా శీతాకాలం.. సినిమా కథ శీతాకాలంలో మొదలవుతుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టారేమో. ఎందుకంటే, కథకు ఈ టైటిల్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే, ప్రేమికులకు మంచి సీజన్ శీతాకాలం కాబట్టి ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టి ఉండొచ్చు. టైటిల్ విషయం పక్కన పెడితే.. ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకున్నా… పూర్తి స్థాయిలో మాత్రం సినిమా మెప్పించలేకపోయింది. అయితే, కథలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా లవర్స్ కి కనెక్ట్ అవుతుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం నచ్చదు.

 

Tags :