రాష్ట్రంలో సమైక్యవాదుల కుట్రలు : గుత్తా సుఖేందర్

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖం చెల్లక తెలంగాణలో దండులా విరుచుకుపడుతున్నారని విమర్శించారు. మళ్లీ దోచుకుందామని తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంపై ప్రధాని మోదీ అడుగడుగునా విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ కూల్చారని ఫైరయ్యారు. ఇప్పుడు ప్రధాని కన్ను తెలంగాణపై పడిరదన్నారు. దత్తపుత్రిక పాదయాత్ర చేస్తూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులను జైల్లో పెట్టేలా అవినీతి చెందిన దత్త పుత్రిక కుటుంబం కాదా అని ప్రశ్నించారు. మళ్లీ ఇక్కడకు వచ్చి నీతులు మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.