కన్నుల పండువగా జిడబ్ల్యుటిసిఎస్‌ దీపావళి వేడుకలు

కన్నుల పండువగా జిడబ్ల్యుటిసిఎస్‌ దీపావళి వేడుకలు

అమెరికా రాజధాని వేదికగా బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ‘‘దీపావళి వేడుకలు’’ సుమారు 1200 మంది తెలుగు వారి మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. కరోనా దశ తర్వాత ప్రత్యక్షంగా  నిర్వహించిన అతిపెద్ద వేడుకగా ఇది చెప్పవచ్చు, పూర్తి నిబంధనలు పాటిస్తూ సాగిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. సాయంత్రం 4 గంటల నుండి మొదలైన సందడి చిన్నారుల కేరింతలతో, మహిళల సంప్రదాయ వస్త్ర ధారణతో ఎటుచూసినా పండుగ వాతావరణాన్ని సృష్టించింది. తెలుగు కట్టు, బొట్టు, దీపావళి పండుగ, సంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లు చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాన్ని  ప్రేక్షకులు మిన్నంటే కరతాళ ధ్వనులతో అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సినీ నటి శ్రీమతి లయ, గాయని సుమంగళి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. మహిళల ఫాషన్‌ షో ఎంతో అలరించింది. ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన ‘‘చిత్ర లేఖనం’’ పోటీలో వందకు పైగా చిన్నారులు పాల్గొన్నారు.  రుచికరమైన భోజనంతో, ఆత్మీయ వాతావరణంలో సాయంత్రం ఎంతో ఆహ్లాదంగా సాగింది.

50 సంవత్సరాలుగా, నిర్విరామంగా తెలుగు భాష , సంస్కృతిని ప్రతి తరానికి దగ్గర చేస్తూ సాగుతున్న ఈ సంస్థ, కరోనా ఆపత్కాల సమయంలో అమెరికా, ఇండియా లో కూడా నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలను పలువురు గుర్తుచేస్తూ  కీర్తించారు. తమ సంస్థకూ సామాజిక భాద్యత కూడా ఒక భాగమని, ఇక ముందూ భాద్యతగా కొనసాగిస్తామని అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థకు వెన్నంటి నిలుస్తున్న దాతలను, ఆదరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సహ సంస్థలైన తానా, ఆటా, టీడీఎఫ్‌, కాట్స్‌ పలుసంస్థల పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. చిన్నారుల ప్రాతినిధ్యంతో ‘‘చేతనా ఫౌండేషన్‌’’కు అద్భుత స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలని, సామాజిక భాద్యతగా పాటించాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు, కార్యవర్గ సభ్యులు పాల్గొని తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

Click here for Event Gallery

 

Tags :