విలేఖరికి హరీష్ కౌంటర్

ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. తెలుగు సినిమాను ఇప్పుడు ఎవరు తక్కువ చేసి మాట్లాడినా అది తప్పే. అది ఎంత గొప్ప డైరెక్టరైనా, ఆర్టిస్ట్ అయినా, మీడియా అయినా సరే. మలయాళం బ్లాక్ బస్టర్ 2018 తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ సందర్భంగా రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత బన్నీ వాస్.
ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు విలేఖరి నుంచి ఓ వింత ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్ లో ఇంత గొప్ప సినిమాలు ఎవరూ తీయట్లేదని, మన డైరెక్టర్లు అలా ఆలోచించలేరని మీకనింపించే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారా అని అడిగాడు. ఈ ప్రశ్నకు హరీష్ శంకర్ అయితే సరిగ్గా సమాధానం చెప్తారని వాస్ వెంటనే హరీష్ కు మైక్ ఇచ్చాడు.
హరీష్ ఈ ప్రశ్నకు సరైన కౌంటరే ఇచ్చాడు. ప్రపంచం మొత్తం తెలుగు దర్శకుల వైపు, తెలుగు సినిమా వైపు చూస్తుంటే మనం అలాంటివి తీయలేమా అని అడగడమే అర్థం లేని ప్రశ్న అని, బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలను డబ్బింగ్ సినిమాలని వేరే భాష ఆడియన్స్ అనుకున్నారా? వరల్డ్ సినిమా మన చేతుల్లోకి వచ్చే టెక్నాలజీలో ఉన్న రోజుల్లో కూడా మీరు ఇలాంటి గీతలు గీయడంలో అర్థం లేదని ఆ విలేఖరి పేరు చెప్ప మరీ చురకలంటించాడు హరీష్.
హరీష్ హార్ష్ గా చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఇప్పుడే కాదు నలభై ఏళ్ల కిందటే శంకరాభరణం లాంటి సినిమా కేరళలో వంద రోజులు ఆడింది. రష్యా తదితర దేశాల్లో ఆ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు కొత్తగా తెలుగు సినిమా ఎవరికీ ప్రూవ్ చేసుకునే స్థితిలో లేదు. స్టాండర్స్ గురించి తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తగా ఎవరూ నేర్పించాల్సిందేమీ లేదు. ప్రస్తుతం హరీష్ మాట్లాడిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.