సీఎంవో ప్రత్యేకకార్యదర్శి స్మితా సబర్వాల్ కు షాక్ ..ప్రభుత్వానికి 15లక్షలు తిరిగివ్వాలని హైకోర్టు ఆదేశం

సీఎంవో ప్రత్యేకకార్యదర్శి స్మితా సబర్వాల్ కు షాక్ ..ప్రభుత్వానికి 15లక్షలు తిరిగివ్వాలని హైకోర్టు ఆదేశం

తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. స్మితా సబర్వాల్ గతంలో అవుట్ లుక్ మ్యాగజైన్ పై పరువునష్టం దావా వేసిన కేసులో ఆమెకు చుక్కెదురైంది. స్మితాసబర్వాల్ వేసిన పరువు నష్టం దావాపై కోర్టు ఫీజుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూర్చడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. 90 రోజుల్లో కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం ఇచ్చిన 15 లక్షల రూపాయలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

2015లో అవుట్ లుక్ మ్యాగజైన్ లో స్మితాసబర్వాల్ ఫోటోను అవమానకరంగా ప్రచురించారు. అప్పట్లో ఈ ఫోటో పై రాజకీయ వర్గాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఫోటోకి సంబంధించి పరువు నష్టం దావా వేసేందుకు కోర్టు ఫీజులు చెల్లించడానికి స్మితాసబర్వాల్ కు 15 లక్షల రూపాయలు మంజూరు చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై అవుట్ లుక్ మ్యాగజైన్ తో పాటు, మరో ఇద్దరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగతంగా వేసిన వ్యాజ్యానికి ప్రభుత్వం ఫీజులు ఏవిధంగా చెల్లిస్తుంది అంటూ వారు ప్రశ్నించారు. ఇక దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ వ్యక్తిగతంగా వేసిన వ్యాజ్యానికి ప్రభుత్వ నిధులను సమకూర్చడంపై విస్మయం వ్యక్తం చేసింది.

ఒక ప్రైవేటు వ్యక్తి మరో ప్రైవేటు సంస్థ పై వ్యాజ్యం వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని పేర్కొన్న కోర్టు, ప్రభుత్వం స్మితాసబర్వాల్ పరువునష్టం దావా వేయడానికి ఇచ్చిన 15 లక్షల రూపాయలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలు సరిగా లేకుంటే హైకోర్టు సమీక్షించవచ్చు అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఆదేశాలతో స్మితాసబర్వాల్ కు, తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టైంది. ఇక 90 రోజుల్లోగా స్మితాసబర్వాల్ ప్రభుత్వం ఇచ్చిన 15 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంది.

 

 

Tags :