రివ్యూ : 'హిట్ 2' కూడా హిట్టే

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా
నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
ఎడిటర్: గ్యారీ బి ఎచ్, సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్
సంగీత దర్శకులు: ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సమర్పణ : నాచురల్ స్టార్ నాని, నిర్మాత: ప్రశాంతి తిపుర్ననేని
దర్శకుడు : డా. శైలేష్ కొలను
విడుదల తేదీ: 02.12.2022
ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి హీరో నాని నిర్మాతగా 2020లో వారు చేసిన సినిమా హిట్ ది ఫస్ట్ కేస్. దర్శకుడు శైలేష్ కొలను హిట్ యూనివర్స్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో భాగంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తొలి సినిమా విశ్వక్ సేన్ హీరో గా ఆ సినిమా హిట్ కావటంతో దానికి ఫ్రాంచైజీగా ‘హిట్ 2 ది సెకండ్ కేస్’ను రూపొందించారు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించారు. ఫస్ట్ ప్టార్ట్ హిట్ కావటంతో సెకండ్ పార్ట్‌పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. దానికి తోడు.. టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేశాయి. మరి హిట్ 2 ప్రేక్షకులను నిజంగానే ఆకట్టుకుందా? సెకండ్ కేస్‌ను డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్ పాత్ర ఎలా ఉంది? ఎలాంటి కేసుని సెకండ్ కేస్‌లో సాల్వ్ చేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవండి.
కథ :
కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్. వైజాగ్ సిటీలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌కి సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తుంటారు. అతనికి కాస్త వెటకారం ఎక్కువ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా అని సీరియస్‌గా ఉండడు, కాస్త కూల్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఆర్య (మీనాక్షి చౌదరి)ని ప్రేమిస్తాడు. ఇద్దరు కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. కూల్‌గా ఉండే కె.డిని ఓ మర్డర్ కేసు టెన్షన్ పెడుతుంది. ఓ పబ్‌లో పని చేసే సంజన అనే అమ్మాయిని ఓ సైకో కిల్లర్ చంపేసి తల, కాళ్లు, మొండెం అంటూ ముక్కలు చేసేస్తాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో తల మాత్రమే సంజనదని, మిగిలిన బాడీ పార్ట్ మరో ముగ్గురు అమ్మాయిలదనే నిజం తెలిసి షాకవుతాడు కె.డి. అంటే నాలుగు హత్యలను చేసిన ఆ సైకో కిల్లర్‌ను పట్టుకోవటానికి ఆధారాలు కూడా ఏవీ దొరకవు. ఉన్న ఆధారాలు మిస్ లీడ్ చేయటంతో ఓ అమాయకుడు చనిపోతాడు. దాంతో కృష్ణదేవ్ ఇంకా టెన్షన్ పడిపోతాడు. ఇంతకీ కృష్ణదేవ్ ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నాడా? ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు అమ్మాయిలను చంపుతుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల హావభావాలు:
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో మెప్పించిన హీరో అడివి శేష్ తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో కూల్ కాప్‌గా ఆకట్టుకున్నారు. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలను ఇది వరకే చేసి ఉండటంవతో శేష్ పెద్దగా కష్టపడకుండానే తన కృష్ణదేవ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆయన ప్రేయసి ఆర్య పాత్రలో మీనాక్షి చౌదరి బాగానే నటించింది. హీరోకి ఎమోషనల్ సందర్భాల్లో సపోర్ట్ చేస్తూ చివరకు విలన్ చేత చిక్కి ఇబ్బందులు పడే అమ్మాయి పాత్రలో మంచి మార్కులనే దక్కించుకుంది. ఇక రావు రమేష్, తనికెళ్ళ భరణి, సుహాస్, కోమలి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు వారి వారి పాత్రల్లో సూపర్బ్‌గా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు డా. శైలేష్ కొలను రాసుకున్న క్రైం డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు.కోడి బుర్రతో సైకో కిల్లర్ హీరోను ఇబ్బంది పెట్టే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అలాంటి స్క్రీన్ ప్లేతో హిట్ 2ను తెరకెక్కించారు శైలేష్. సినిమా నార్మల్‌గా స్టార్ట్ అయినప్పటికీ రాను రాను సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇస్తాయి. చివరలో కిల్లర్ ఎవరనే విషయంలోనూ దర్శకుడు శైలేష్ చక్కగా డీల్ చేసుకుంటూ వచ్చి హిట్ 3కి హింట్‌ను ఆసక్తికరమైన రీతిలో ఇచ్చారు. ఇక సంగీతం విషయానికి వస్తే శ్రీలేఖ ట్యూన్ చేసిన ఎగిరే ఎగిరే రొమాంటిక్ సాంగ్ బావుంది. ఇక క్రైమ్ థ్రిల్లర్స్‌కు ప్రాణం పోసేది బ్యాగ్రౌండ్ స్కోర్. ఆ విషయంలో జాన్ స్టీవార్ట్ ఎడూరి ముఖ్య భూమికను పోషించారు. మణి కందన్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాత నాని నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
సాధారణంగా టాలీవుడ్లో ఫ్రాంచైజీలు తక్కువ. అందులో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌ను ఫ్రాంచైజీగా చేయాలంటే చాలా ప్లానింగ్‌తో ముందుకెళ్లాల్సి ఉంటుంది. అయితే దర్శకుడు శైలేష్ కొలను ముందు నుంచే ఫ్రాంచైజీ ఆలోచనతో ఉండటంతో హిట్ 1 ది ఫస్ట్ కేస్ ఇచ్చిన కిక్‌తో హిట్ 2 ది సెకండ్ కేస్‌ను తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. శేష్ నటన అండ్ లుక్స్ మరియు ఆటిట్యూడ్ బాగున్నాయి. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలిచాయి. అయితే, విలన్ ట్రాక్ అండ్ మోటివ్ ఇంకా బెటర్ గా రాసుకొని ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.