రివ్యూ: న్యూ ఏజ్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ 'హంట్'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్
నటీనటులు: సుధీర్ బాబు, శ్రీకాంత్ మేక, భరత్ నివాస్, మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ తదితరులు నటించారు.
సంగీత దర్శకులు: జిబ్రాన్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్
సహా నిర్మాత : అన్నే రవి, నిర్మాత: వి ఆనంద ప్రసాద్
దర్శకుడు : మహేష్ సూరపనేని
విడుదల తేదీ : 26.01.2023
డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో విలక్షణమైన మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ తరుణంలో సుధీర్ బాబు హంట్ అనే మరో సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్, ట్రైలర్‌ను గమనిస్తే గతాన్ని మరచిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ .. మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశాడనేదే కథాంశమని అర్థమవుతుంది. చాల కాలం తరువాత తమిళ్ హీరో భరత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసారు. మరి ఈ సినిమాతో సుధీర్ బాబుకి సక్సెస్ దక్కిందా..లేదా? అనే విషయాలు తెలియాంటే సమీక్షా లో చూద్దాం.
కథ:
హైదరాబాద్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఏసీపీగా పని చేసే అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) నిజాయితీ గల పోలీసు ఆఫీసర్, తన కొలీగ్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ ఆర్యన్ దేవ్ (భరత్) హత్యకి గురిఅవుతాడు. ఈ కేసును అర్జున్ కు అప్పగిస్తారు. ఈ క్రమంలో కేసుని అర్జున్ డీల్ చేయటం ప్రారంభిస్తాడు. అయితే ఓరోజు మర్డర్‌ను ఎవరు చేశారో తాను తెలుసుకున్నానని, కమీషనర్ మోహన్ భార్గవ్ (శ్రీకాంత్)కి ఫోన్ చేసి చెబుతాడు. అదే సమయంలో అర్జున్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. తాను గతమంతా మరచిపోతాడు. అర్జున్ గతాన్ని మరచిపోయాడనే నిజం మోహన్ భార్గవ్‌కి మాత్రమే తెలుసు. దాంతో తను ఆ విషయాన్ని దాచి పెట్టి మళ్లీ ఆర్యన్ దేవ్ కేసుని డీల్ చేయమంటాడు. అర్జున్ మళ్లీ తన టీమ్‌తో కలిసి కేసుని సాల్వ్ చేయటం మొదలు పెడతాడు. ఆ క్రమంలో రాయ్ (మైమ్ గోపి), కల్నల్ విక్రమ్ సింహ (కబీర్ దుహాన్ సింగ్), ఓ టెర్రరిస్ట్ ముఠాలను అనుమానిస్తాడు. అయితే కేసులో ముందుకు వెళ్లే కొద్ది తనకు షాకింగ్ నిజం తెలుస్తుంది. తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను మర్చిపోయిన సుధీర్ బాబు తన గురించి తాను తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఆ నిజమేంటి? దాని వల్ల ఆర్యన్ దేవ్ హంతకుడు ఎవరో తెలుస్తుందా? ఇంతకీ ఆర్యన్ దేవ్‌ని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటి నటుల హావభావాలు :
ఇలాంటి డిఫరెంట్ పాయింట్ వున్నా కథలో నటించటానికి సాధారణంగా ఏ మాత్రం పేరున్న హీరోలు అంగీకరించరు. కానీ.. మంచి కంటెంట్ ఉందని గ్రహించిన సుధీర్ బాబు ఈ సినిమా చేయటం గొప్ప విషయం. నటన పరంగా మరోసారి తనదైన మార్కులను సుధీర్ బాబు సంపాదించుకున్నాడు. తమిళ నటుడు భరత్ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ తన నటనతో భరత్ ఆకట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్, కబీర్ సింగ్, రవివర్మ, చిత్ర శుక్లా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు మహేష్ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి సంబంధించి గుడ్ పాయింట్ ను తీసుకున్నా.. పాయింట్‌ను మార్చని డైరెక్టర్ మహేష్ స్క్రీన్‌ప్లేను మార్చుకున్నారు. అయితే ఇంకాస్త ఎంగేజింగ్‌గా మార్చి ఉండుంటే బావుండేదనిపించింది. సుధీర్ బాబు ప్లాష్ బ్యాక్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. జిబ్రాన్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ అరుల్ విన్సెంట్ చాలా నేచురల్ గా చూపించారు. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
విశ్లేషణ:
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ముంబై పోలీస్ సినిమా పాయింట్‌తోనే హంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా స్టార్టింగ్ పాయింట్ ఆకట్టుకుంటుంది. మర్డర్ కేసుని సాల్వ్ చేసిన ఓ పోలీస్ ఆఫీసర్ ..అనుకోకుండా గతాన్ని మరిచిపోవడం. తను చివరకు ఎలా కేసుని డీల్ చేశాడనేదే కధాంశం. ఫస్టాఫ్‌లో తొలి ఇరవై నిమిషాలు సుధీర్ బాబుకి యాక్సిడెండ్ కావటం.. గతాన్ని మరచిపోవటం వంటి సీన్స్ బాగున్నాయి. ఇక ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ వరకు ఎలాంటి గ్రాఫ్ లేకుండా ఓ లెవల్లో సినిమా వెళుతుంది. ఇక సెకండాఫ్‌లో కూడా ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కూడా సినిమా అంతే ఓకే ప్యాట్రన్‌లోనే ఉంటుంది. అయితే చివరి ఇరవై నిమిషాలు చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఏది ఏమైనా సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.