తాను అధ్యక్ష పీఠమెక్కితే.. ఆ శాఖ రద్దు

రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను అధ్యక్ష పీఠమెక్కితే, విద్యాశాఖను రద్దు చేస్తానన్నారు. అసలు ఆ శాఖ ఎందుకు ఉందో కూడా తెలియదని పేర్కొన్నారు. ప్రముఖ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ని కూడా రద్దు చేసి, దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తానన్నారు. చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారాలు చేయకుండా నిషేధిస్తాననీ స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ రాజకీయ కార్యచరణ సదస్సు (సీపీఏటీ)లో ఆయన ప్రసంగించారు. దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి, ఆయన ప్రాతిపాదించిన అమెరికా ఫస్ట్ అనే విధానం నుంచి తాను స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు. జాతి, లింగం, పర్యావరణం అనేవి లౌకిక మతాలుగా మారి అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రామస్వామి వ్యాఖ్యానించారు. శరీరం రంగు ఆధారంగా వ్యక్తుల నేపథ్యాన్ని గుర్తిస్తున్నారంటూ ఆసహనం వ్యక్తం చేశారు.