భారత్‌లో తొలి ప్రైవేటు రాకెట్ సూపర్ సక్సెస్..!

భారత్‌లో తొలి ప్రైవేటు రాకెట్ సూపర్ సక్సెస్..!

అంతరిక్ష పరిశోధన, అభివృద్ధిలో భారత్ రోజురోజుకూ మరింత మందడుగు వేస్తోంది. అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో భారతీయ శాస్త్రవేత్తలు అద్భుతాలు సాధిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా అంతరిక్షంలో శాటిలైట్లను ప్రవేశపెడుతున్న చరిత్ర ఒక్క భారత్ కు మాత్రమే ఉంది. ఇదే కోవలో ఇప్పుడు ఇస్రో మరో ముందడుగు వేసింది. ప్రైవేటు రాకెట్లను సైతం ప్రయోగించే స్థాయికి ఎదిగింది. అగ్రదేశాలతో పోల్చినప్పుడు కాస్త వెనుకబడినా తొలి ప్రయోగంలోనే విజయవంతమై సత్తా చాటింది.

ఇస్రో మరో రికార్డ్ సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనకు విక్రమ్ సారాభాయ్ ని పితామహుడిగా పేర్కొంటారు. ఆయన పేరుతో స్కైరూట్ అనే సంస్థ విక్రమ్-ఎస్ పేరుతో ఒక రాకెట్ ను రూపొందించింది. దీన్ని ప్రారంభ్ పేరుతో ఇస్రో ఇవాళ శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించింది. ఇది నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్ కు చెందిన స్కైరూట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ రాకెట్ ను దేశీయంగా తయారు చేసింది. దీని ద్వారా అంతర్జాతీయ సంస్థలతో భారతీయ స్టార్టప్ కంపెనీలు పోటీపడగలవని నిరూపించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడం ద్వారా మరిన్ని కంపెనీలు కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టే అవకాశం కలుగుతుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రపంచంలో ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎలాన్ మస్క్ కు చెందిన స్పెస్ ఎక్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్, వర్జిన్ గ్రూప్ నకు చెందిన వర్జిన్ గెలాక్టిక్.. లాంటివి ఇప్పటికే ఈ రంగంలో ముందున్నాయి. ఇవి అమెరికాలో ఇప్పటికే పలు ప్రయోగాలు చేశాయి. తమను తాము నిరూపించుకున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తీసుకొస్తున్నాయి. భూమిపై మనం ఒక ఊరి నుంచి మరొక ఊరికి పర్యాటకానికి వెళ్లి వచ్చినట్లే భవిష్యత్తులో కూడా స్పేస్ టూరిజంకు అధిక ప్రాధాన్యత ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ సంస్థలు ఈ రంగంలో విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి.

కానీ భారత్ లో మాత్రం ప్రైవేటు అంతరిక్ష సంస్థలు చాలా తక్కువ. తొలిసారి స్కైరూట్ అనే స్టార్పట్ కంపెనీ ఈ రంగంలో పుట్టుకొచ్చింది. కొన్నేళ్లుగా ఇది అంతరిక్షరంగ పరిశోధనల్లో నిమగ్నమై ఉంది. విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో తొలి రాకెట్ ను అంతరిక్షంలోకి పంపి 53 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాకెట్ ను నింగిలోకి పంపాలని స్కైరూట్ భావించింది. దానికి తగ్గట్టే దిగ్విజయంగా రాకెట్ ను రూపొందించింది. మూడు పేలోడ్స్ ను మోసుకెళ్లిన ఈ ప్రారంభ్ మిషన్ సక్సెస్ అయింది. ఏపీకి చెందిన ఎన్ స్పెస్ టెక్ ఇండియా, చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్, ఆర్మేనియాకు చెందిన బజూమ్ క్యూ స్పెస్ రీసెర్చ్ ల్యాబ్ వీటిని డెవలప్ చేశాయి. ఇవన్నీ సక్సెస్ కావడంతో ఆయా పరిశోధనా సంస్థలు ఫుల్ జోష్ లో ఉన్నాయి.

విక్రమ్-ఎస్ రాకెట్ ను కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే రూపొందించారు. సుమారు 2వందల మంది ఇంజినీర్లు ఇందులో పాలుపంచుకున్నారు. 6మీటర్ల పొడవు, 54కేజీల బరువు కలిగిన ఈ రాకెట్ త్రీడీ ప్రింటెడ్ సాలిడ్ ట్రస్టర్స్ ఉన్న తొలి రాకెట్ గా చరిత్ర సృష్టించింది. తొలి రాకెట్ విజయవంతం కావడం సంతోషంగా ఉందని స్కైరూట్ ఏరోస్పేస్ కో ఫౌండర్ పవన్ కుమార్ వెల్లడించారు. ఇదే ఉత్సాహంతం మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.