అమెరికాలో పెరుగుతున్న భారతీయ విద్యార్థులు!

అమెరికాలో పెరుగుతున్న భారతీయ విద్యార్థులు!

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల సంఖ్య 13 శాతం తగ్గినా, ఈ ఏడాది అది భారీగా పుంజుకుంది. వివిధ కోర్సుల్లో చేరేందుకు అమెరికా వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 200 ప్రాంతాల నుంచి విద్యార్థులు అక్కడి సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. వారిలో 20 శాతం మంది భారతీయ విద్యార్థులే. 2020-21 విద్యా సంవత్సరంలో 9.14 లక్షల మంది విదేశీ విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరగా వారిలో 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థుల గణాంకాలను అక్కడి ప్రభుత్వం ఏటా డిసెంబరులో ప్రకటిస్తుంది. అందులో భాగంగా ఓపెన్‌ డోర్స్‌ నివేదికను విడుదల చేసింది. కరోనా పరిస్థితులున్నా విద్యార్థుల కోసం అమెరికా ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారాలు తెరిచే ఉంచింది. గత విద్యా సంవత్సరంలో 62వేల ఎఫ్‌-1 (విద్యార్థి) వీసాలు జారీ చేసింది. ప్రస్తుత గణాంకాలను చూస్తే 2021-22 విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్య  చదవాలనే భారతీయ విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ఈ ఏడాదిలో మరిన్ని వీసాలు జారీ చేస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కాన్సులర్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ కాన్సులర్‌ డాన్‌ హెఫ్లిన్‌ పేర్కొన్నారు.

 

Tags :