రివ్యూ: సూర్య నటనే హైలెట్ గా 'జై భీమ్‌'

రివ్యూ: సూర్య నటనే హైలెట్ గా  'జై భీమ్‌'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

బ్యానర్ : 2D ఎంటర్టైన్మెంట్,
నటీనటులు : సూర్య, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌, రాజిష విజయన్‌, లిజోమోల్‌ జోసీ, మణికంఠన్‌ తదితరులు
సంగీతం :  షాన్‌ రొనాల్డ్‌, ఎడిటింగ్‌ : ఫిలోమిన్‌ రాజ్‌, సినిమాటోగ్రఫీ : ఎస్‌.ఆర్‌.కాదిర్‌
నిర్మాతలు : సూర్య, జ్యోతిక, దర్శకత్వం : టి.జె.జ్ణానవేల్
విడుదల తేది : నవంబర్‌ 02, 2021
విడుదల వేదిక : అమెజాన్‌ ప్రెమ్‌ వీడియో

తమిళ స్టార్‌ హీరో సూర్య ధైర్యానికి నిదర్శనమ్ ఆకాశం నీ హద్దురా! డైరెక్ట్ గా ఓ టి టి లో రిలీజ్ చేయడం. పైగా  విభిన్నమైన కథలతో తెరకేక్కే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. కొత్త కొత్త గెటప్ లలో దర్శనం ఇస్తూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. సూర్య నిర్మాతగా  తాజాగా మరో సారి ఓటిటి లో మన ముందుకు వచ్చిన ఈ స్టార్‌ హీరో చేసిన మరో ప్రయోగమే ‘జై భీమ్‌’. కోర్టు రూమ్‌ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఈ రోజు నవంబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైంది. దళితులపై అగ్ర కులాల ఆకృత్యాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ :
గిరిజన దంపతులైన  రాజన్న(మణికందన్‌), సినతల్లి(లిజోమోల్‌ జోస్‌)  పాములు పట్టుకుంటూ జీవనం సాగిస్తారు. ఒక రోజు ఆ ఊరి ప్రెసిడెంట్‌ ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు రాజన్న వెళ్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్‌ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఈ కేసులో రాజన్నను అరెస్ట్‌ చేస్తారు పోలీసులు. పాములు పట్టే క్రమంలో అన్ని గమనించే రాజన్న ఈ చోరీకి పాల్పడ్డాడని కేసు ఫైల్‌ చేస్తారు. నేరం ఒప్పుకోమని రాజన్నతో పాటు అతని కుటుంబ సభ్యులను సైతం వేధిస్తారు. అయితే చేయని తప్పుని ఒప్పుకోనని మొండికేస్తాడు రాజన్‌. కట్‌ చేస్తే.. జైలు నుంచి రాజన్న తప్పించుకుపోయాడని భార్య సినతల్లికి చెబుతారు పోలీసులు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. తన భర్త ఆచూకి కోసం లాయర్‌ చంద్రు(సూర్య)ను కలుస్తుంది సినతల్లి. ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కేసును టేకాప్‌ చేస్తాడు చంద్రు. ఈ క్రమంలో చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? రాజన్న కోసం చంద్రు వేసిన పిటిషన్‌ కారణంగా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి?ఇంతకీ రాజన్న ఏమయ్యాడు? అనేది బుల్లి తెరపై చూడండి...

నటి నటుల హావభావాలు :
ఈ సినిమాకు సూర్య అద్భుతంగా నటించాడు అతని  నటన ప్రధాన బలమని చెప్పాలి. లాయర్ చంద్రుగా  డైనమిక్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పాత్రలో సూర్య ఒదిగిపోయారనే చెప్పాలి. అయితే సినిమా మొదలు నుంచి చివరి వరకు సూర్య ఎక్కడ కూడా అతిగా చేయకుండా చక్కటి భావోద్వేగాలను కనబరిచాడు.
గిరిజన మహిళగా నటించిన లిజోమల్ జోస్ తన పాత్రతో ఆకట్టుకుంది. తన భర్త కోసం నిస్సహాయ గర్భిణిగా పోరాడుతున్న ఆమెను చూపించిన విధానం చాలా బాగుంది. అదే విధంగా రాజన్న పాత్రలో మణికందన్ కూడా ఘాటుగానే ఉన్నాడు. అతని లుక్ ఏదైనా కావచ్చు లేదా అన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో నొప్పిని ప్రదర్శించే విధానం వాస్తవికంగా కనిపిస్తుంది. ప్రభుత్వ లాయర్‌గా రావు రమేష్  కనిపించి తన పాత్రలో చాలా పవర్ ఫుల్‌గా నటించాడు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడి సూర్యకి గట్టిపోటీ ఇచ్చాడు. కోర్టు హాలు సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్‌గా చూపించారు. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్,  మిగతా నటీనటులు తమిళులే అయినప్పటికీ చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.!

సాంకేతిక వర్గం పనితీరు:
ఇక దర్శకుడు జ్ఞానవేల్ విషయానికి వస్తే సినిమాను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. లాయర్ చంద్రుడి నిజ జీవిత కథను తీసుకొని అతని అత్యుత్తమ కేసులలో ఒకదాన్ని తెరపై చూపిస్తూ గ్రిప్పింగ్ నేరేషన్‌తో స్క్రీన్‌ప్లేను అడాప్ట్ చేసిన విధానం హైలైట్ అని చెప్పాలి. గిరిజన దంపతులు పడే బాధను మనసును కదిలించే రీతిలో ప్రదర్శించారు. సూర్య  సినిమా నిర్మాణ విలువలు చాలా వాస్తవికంగా ఉన్నాయి. కోర్టు హాలు మొత్తం చెన్నైలో వేసిన భారీ సెట్‌తో అద్భుతంగా ఉంది. కెమెరా వర్క్ మరియు గిరిజన తారాగణం చాలా చక్కగా ప్రదర్శించబడింది. సీన్ రోల్డాన్ అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా స్ట్రయిట్ మూవీ లా అనిపించింది.  

విశ్లేషణ:
పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్‌’. 1995లో త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో జ‌రిగిన ఓ నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు జ్ణానవేల్. ఇటీవల తెలుగులో వచ్చిన వకీల్‌ సాబ్‌, నాంది, తిమ్మరుసు సినిమాల మాదిరే ‘జైభీమ్‌’  కూడా కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కింది. లాయర్‌ చంద్రుగా సూర్య ఎంట్రీ అయినప్పటి సినిమాపై ఆసక్తి పెరుగుతంది. అరెస్ట్‌ అయిన రాజన్న జైలులో కనిపించకపోవడం, అతను ఏమయ్యాడే విషయాన్ని చివరి వరకు చెప్పకపోవడంతో సినిమాపై ఉత్కంఠ పెరుతుంది. పోలీసులు అతడిని ఏం చేశారు? అసలు బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుడి మదిలో మొదలవుతాయి. చివరకు అసలు విషయం తెలిసి భావోద్వేగానికి లోనవుతారు. ప్రధాన కథలోకి రావడానికి కొంత సమయం పట్టినా, కమర్షియల్ అంశాలు లేకపోయినా కూడా చివరి వరకు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తిగానే అనిపిస్తుంది. అయితే ఓటీటీ ద్వారా మంచి సీరియస్ ఫిలింస్ కోరుకునే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. 

 

Tags :