తొలిసారిగా భారత్ లో జీ-20 సమావేశాలు

తొలిసారిగా జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. జమ్ముకాశ్మీర్ ఈ ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదిక కానుంది. 2023లో జరిగే ఈ సదస్సు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలకు ఆతిథ్యమివ్వనుంది. ఈ సమావేశాలు భారత్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఈ మేరకు సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఈ నెల 23న జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమ్ముకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే.
1999లో జీ-20 సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి భారత్ సభ్య దేశంగా ఉన్నప్పటికీ 2014 నుంచి ఈ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ తరపున ప్రధాని మోదీ పాల్గొంటూ వస్తున్నారు. జీ20 సభ్యదేశాల్లో ఉన్న ఓ దేశం ప్రతిఏటా డిసెంబర్లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు ఈ ఏడాది డిసెంబర్ 1న అధ్యక్షత బాధ్యతలు లభిస్తాయి.