టీడీపీతో పొత్తు ఖాయం.. బీజేపీకి దూరం.. తేల్చేసిన పవన్

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తప్పకుండా ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఏదో అనుకుంటోందని.. అది జరగదని తేల్చేశారు. ప్రజలు ఇంకేదో కోరుకుంటున్నారని.. అది మాత్రం తప్పకుండా జరుగుతుందని ప్రకటించారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనుసరించే విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్నట్టు వెల్లడించారు. ఈసారి తప్పులకు అవకాశం ఇవ్వబోమని.. కచ్చితంగా వైసీపీ సర్కార్ ను గద్దె దించుతామని చెప్పారు.
బీజేపీతో ప్రయాణంపై జనసేనాని పవన్ కల్యాణ్ అంసతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కలసి రాకపోవడం వల్లే తాము ఎదగలేకపోయామని చెప్పారు. రెండు పార్టీలు ఎదిగి ఉంటే టీడీపీతో పొత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదన్నారు పవన్. వైసీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా ఈసారి రెచ్చిపోయేది లేదన్నారు. 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలంటూ వైసీపీ పదేపదే రెచ్చగొడుతోందని.. టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదనేది వాళ్ల ఉద్దేశంగా కనిపిస్తోందని పవన్ చెప్పారు. కానీ ప్రజలు మాత్రం టీడీపీతో కలిసి వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారని.. అది కచ్చితంగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలు కోరుకున్నట్టు ఈసారి జరగదన్నారు.
బీజేపీతో ప్రయాణంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ విషయంలోనూ బీజేపీ కలసిరాలేదని.. ఆ పార్టీ కలిసి వచ్చింటే రెండూ ఎదిగేందుకు అవకాశం ఉండేదన్నారు. ఢిల్లీ నేతలు ఒకటి చెప్తే రాష్ట్ర నేతలు మరొకటి చేస్తారన్నారు. అమరావతి విషయంలోనూ ఇదే జరిగిందన్నారు. ఒంటరిగా పోటీ చేసి బలపశువు కావడానికి తాను ఈసారి సిద్ధంగా లేనని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకోసం మాత్రం బలిపశువు కావడానికైసనా సిద్ధమన్నారు. మొత్తంగా బీజేపీతో ప్రయాణంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు అర్థమైంది. ఇకపై బీజేపీతో కలిసి ప్రయాణం చేసేది లేదని పవన్ స్పష్టంగా తేల్చేశారు.
పవన్ కల్యాణ్ ను టీడీపీ నుంచి దూరం చేయాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అని ప్రతిసారి రెచ్చగొడుతోంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తాను ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోనని క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా పవన్ ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారని పేరుంది. కానీ ఈసారి మాత్రం తాను అలా చేయబోవడం లేదని.. పొత్తు పెట్టుకుంటానని స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు తేల్చారు. దీంతో టీడీపీ- జనసేన ఈసారి కలిసి పోటీ చేయబోతున్నాయని అర్థమైంది.