రివ్యూ : నవ్వుల త్రి 'జాతి రత్నాలు'

రివ్యూ : నవ్వుల త్రి 'జాతి రత్నాలు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్ : స్వప్న సినిమాస్
నటీనటులు :  నవీ‌న్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ,
బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం : రథన్, సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్ 
ఎడిటింగ్ : అభినవ్ రెడ్డి దండ, నిర్మాతలు : నాగ్‌ అశ్విన్
దర్శకత్వం : అనుదీప్‌
విడుదల తేది : 11. 03. 2021

'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' తో హిట్టు కొట్టినప్పటినుంచి నవీన్ పోలిశెట్టిపై యంగ్ ఆడియన్స్ లో అంచనాలు ఆకాశాన్నంటాయి. దానికి తోడు "జాతిరత్నాలు" ట్రైలర్ ఆసక్తిగా ఉండడంతో ఈ చిత్రంపై కూడా ఆడియన్స్ చూడాల్సిన సినిమాగా విడుదలకు ముందే పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది.  ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచే దానిపై చర్చ మొదలయింది. టైటిల్‌ డిఫరెంట్‌గా ఉండడం, ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించడంతో ‘జాతి రత్నాలు’మూవీపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో ఆ అంచనాలు తారాస్థాయికి పెరిగాయి. నాగ్ అశ్విన్ నిర్మాత కావడం ఈ సినిమాపై అదనపు మర్యాద, ఆసక్తి పెంచాయి. ఇక ప్రొమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసారు. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తీరూ తెన్నూ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇన్ని అంచనాల మధ్య మహాశివరాత్రి కానుకగా గురువారం మార్చ్ 11న విడుదలైన ‘జాతిరత్నాలు’ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ:

మెదక్‌ జిల్లా జోగిపేట గ్రామానికి చెందిన లేడీస్ ఎంపోరియం ఓనర్ (తనికెళ్ళ భరణి) కొడుకు శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి). శ్రీకాంత్ కి  ఇద్దరు స్నేహితులు రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి). ఈ ముగ్గురు అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వీరంటే ఊళ్లో వాళ్లకి చిరాకు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియంలో శ్రీకాంత్‌ పని చేయడంతో అతన్ని అందరూ‘లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్’అని పిలుస్తుంటారు. అలా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, హైదరాబాద్‌కి వెళ్లి ఉద్యోగం చేస్తానని బ్యాగు సర్దుకొని సిటీకి ఒక పచ్చ రంగు పాత మారుతి కారులో బయలుదేరతాడు. అతనితో పాటు ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్‌ కూడా హైదరాబాద్‌కు వస్తారు. అక్కడ శ్రీకాంత్‌ చిట్టి (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు. కట్‌చేస్తే.. ఈ ముగ్గురు అనుకోకుండా ఓ హత్య కేసులో అరెస్ట్‌ అవుతారు. అసలు ఆ హత్య కేసుకి, ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి ముగ్గురు ఎలా తప్పించుకున్నారు? అనేదే మిగతా కథ. 

నటి నటుల హావభావాలు:

ఈ సినిమా మొత్తం నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ పాత్రల చుట్టే తిరుగుతుంది. .అయితే మెయిన్ గా  సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టి భుజాలమీదే మోసాడు. అమాయకత్వంలోనే హీరోయిజం చూపించడం వల్ల సగటు ప్రేక్షకుడు ఆ పాత్రకి ఎమోషనల్ గా కనెక్ట్ అవడం సహజం. ఇక ప్రియదర్శి,  రాహుల్ రామకృష్ణ తన ఉనికిని కాపడుకోగలిగే విధంగా నటించి మెప్పించాడు.  హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిండైన విగ్రహంతో  బాగుంది. నటన పరంగా కూడా పర్వాలేదు. ఈ చిత్రం లో  మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం కూడా కాసేపు కనిపించినా బాగా నవ్వించారు. అతిథి పాత్రలో కీర్తి సురేష్ ఒక  మెరుపులా మెరిసింది. మిగతా నటి నటులు గురించి ప్రత్యేకంగా  చెప్పేదేమీ లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

ముగ్గురు అమాయకులు‌.. ఒక సీరియస్‌ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా మలిచాడు దర్శకుడు అనుదీప్‌. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై అశ్లీలం లేని కామెడీతో బాగా డీల్ చేసాడు. అలాగే తాను రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్  చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్‌ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కొచ్చి సన్నివేశాల్లో కామెడీ మరీ ఓవర్‌ అయినట్లు అనిపిస్తుంది. సిద్దం మనోహర్  కెమెరా పనితనం ఓకే.  ఇక ఈ సినిమాకు మరో జాతి రత్నం సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది.  ఎడిటింగ్ మాత్రం చాలా పూర్ గా ఉంది. కొన్ని చోట్ల సీన్ పూర్తవకుండా మధ్యలోనే జంప్ కొట్టినట్టుగా అనిపించింది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

విశ్లేషణ:

కాన్సెప్ట్  పరంగా కంటెంట్  చూసుకుంటే, హడావిడి చేసినంత కొత్త  విషయమైతే లేదు గానీ....  ఏదో కాలక్షేపంలాగ  సినిమా సాగుతుంది.  మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ రెండు మూడు సార్లు టైం చూసుకునేలా చేసింది. రాసుకున్నదే సదా సీదా కథ   ఆ కథ నడుస్తున్న తీరులో ఉత్కంఠతగాని  , ఎటువంటి సర్ప్రైజెస్ ఇవ్వడం గాని ఎలెమెంట్స్ కనపడవు. అయితే సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోవడం ప్రత్యేకత. కథ, లాజిక్ లాంటివి పట్టించుకోకుండా ఒక స్పూఫ్ సినిమాని చూస్తున్నట్టుగా చూసేస్తే సినిమా బాగుందే అనిపిస్తుంది. కథ ఎలా ఉన్నా చివరిదాకా ఎనెర్జీతో కూర్చోబెట్టగల స్పార్క్ నవీన్ పోలిశెట్టి లో ఉందని మరో సారి రుజువయింది. బాక్సాఫీసు మీద మూకుమ్మడి దాడి చేసినట్టుగా ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకుల్లో సగం మందికి నచ్చినా మౌత్ టాక్ వల్ల ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అశ్లీలం లేని క్లెన్ కామెడీ కనుక కుటుంబసమేతంగా చూసినా ఇబ్బంది ఉండదు. సెకండ్ హాఫ్ లో  ఎడిటింగ్ చేసుకుని  క్రిస్పీగా వుండి  స్పీడ్  అందుకుంటే రన్ విషయంలో తిరుగులేదు.  

 

Tags :